కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ కు తెలంగాణా బీజేపీ చీఫ్ మద్దతు
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బండి భగీరధ్ పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, ఆయనకు మద్దతు ప్రకటించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసిన రాంచందర్ రావు, ఈ కేసును రాజకీయలబ్ది కోసం బీఆర్ఎస్ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
బండి సంజయ్ ను టార్గెట్ చేసిన కేటీఆర్ .. బదులిచ్చిన బీజేపీ చీఫ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్ తక్షణం రాజీనామా చేయాలని, కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాంచందర్ రావు స్పందించారు. బండి సంజయ్, ఆయన కుటుంబం మరియు బీజేపీపై తెలంగాణలోని వివిధ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పోస్టర్లు వేయించి, రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

బండి సంజయ్ ఏ తప్పు చెయ్యలేదు
ఒక వ్యక్తిని మరియు అతని కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయ లబ్ది కోసం ఈ పని చేస్తున్నారని ఆయన అన్నారు. బండి సంజయ్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని, ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోదని స్పష్టం చేశారు. అయితే, కుటుంబ సభ్యులు ఏవైనా తప్పులు చేస్తే న్యాయపరంగా చర్యలు ఉంటాయని కూడా పేర్కొన్నారు. బండి భగీరథ్ కేసును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు.
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో రాజీనామా చేశారా?
ఇది కేవలం బండి సంజయ్‌పైనే కాకుండా బీజేపీపైనా జరుగుతున్న దుష్ప్రచారమన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై నేరాలు 67 శాతం పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. మద్యం కేసులో కవిత జైలు పాలైతే మీ పదవులకు రాజీనామా చేశారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ పార్టీ ఏం చర్య తీసుకుందని నిలదీశారు.
కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్టు చేయాలని డిమాండ్
కేటీఆర్‌కు నైతిక బాధ్యతలు లేవని, సొంత కుటుంబంలోనే తప్పులు జరిగితే ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫార్ములా ఈ-కార్ రేసు కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ కలయిక వల్లే వారిని అరెస్టు చేయడం లేదని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశమయ్యాయి. బండి సంజయ్ కేసు ఇప్పటికే SIT దర్యాప్తు జరుగుతోంది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో రాంచందర్ రావు వ్యాఖ్యలు బీజేపీ తరఫున బలమైన సమాధానంగా మారాయి.












Click it and Unblock the Notifications