‘అవినీతి మంత్రికి కేసీఆర్ వత్తాసు! తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్, ఏ కిషోర్ కాపాడలేరు’
హైదరాబాద్: కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ ఛుగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. .హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్‌కు బుద్ధి చెబుతామన్నారు.

ఏప్రిల్ 14నుంచి రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర: బండి సంజయ్
మార్చి 6 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ నుంచి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయ్యిందని, అందుకే పార్లమెంట్ స్థాయి తొలి సదస్సు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించకుని ఏప్రిల్ 14 నుంచి రెండో దశ 'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభిస్తున్నామని తెలిపారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ జనగామ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారని.. అదే జనగామలోనే మార్చి నెలాఖరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ సత్తా చూపిస్తామన్నారు బండి సంజయ్.

అవినీతి మంత్రిని కాపాడుతున్నారంటూ కేసీఆర్‌పై బండి ఫైర్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌పై ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్ చేయడం అత్యంత దారుణమన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఫిర్యాదుదారులను పోలీసులే కిడ్నాప్ చేశారన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి, భూ కబ్జాలను సహించలేక ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ చేయడం అన్యాయమన్నారు. బీజేపీ ఆందోళనతో కిడ్నాప్ చేసిన ఫిర్యాదుదారులను పోలీసులు బయటకు తీసుకొచ్చినప్పటికీ వారిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల కమిషన్ మంత్రి తప్పుడు అఫిడవిట్ పై ఎన్నికల కమిషన్ విచారణ ముగిసే వరకు ఆరుగురు ఫిర్యాదు దారులను జైళ్లో పెట్లడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారు. చట్టబద్దంగా కొట్లాడే ధైర్యం లేని సీఎం.. అడ్డగోలుగా గెలిచి అవినీతికి పాల్పడుతున్న మంత్రికి వత్తాసు పలుకుతూ కిడ్నాప్ లు చేయించడం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు. ఆ మంత్రి రాజీనామా చేసే వరకు పార్టీ పరంగా ఆందోళనలను కొనసాగిస్తామన్నారు.

తెలంగాణ ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు: బండి సంజయ్
రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తామని బండి సంజయ్ అన్నారు. గత ఎన్నికలకు ముందు ఆయా నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో చూపిన ఆస్తులను, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక సంపాదించిన ఆస్తులను బేరీజు వేసి వాటి ఆధారంగా విచారణ జరిగేదాకా ప్రజా క్షేత్రంలో పోరాడతామని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలవల్లే బెంగాల్‌లో బీజేపీ ఓట్ల శాతం 40 శాతం దాటింది. గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలోనూ బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.హైదరాబాద్ సిటీలో బీజేపీ ఓటు బ్యాంక్ 60 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఇందుకు గత ఎన్నికల ఫలితాలతోపాటు వివిధ సర్వేల్లో వెల్లడైన ఫలితాలే నిదర్శనం.బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియడంతో సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.

తెలంగాణ ప్రజలూ డబుల్ ఇంజిన్ సర్కారు కోరుకుంటున్నారు
తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఈసారి అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు బండి సంజయ్. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు. నిజమైన ఉద్యమకారులతోపాటు ప్రజాస్వామిక తెలంగాణ కోరుకునే మేధావులంతా బీజేపీలోకి రావాలని కోరారు. అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించి ప్రజా స్వామిక తెలంగాణను ఏర్పాటు దిశగా కృషి చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట పెరుగుతోందన్నారు బండి సంజయ్.

ఏ కిషోర్‌లూ కేసీఆర్‌ను కాపాడలేరంటూ తరుణ్ చుగ్
మరోవైపు, బీజేపీ తెలంగాణ వ్యవహారల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ కూడా సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పొలిటికల్ టూరిజం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్తున్నారు. ఇండియాకు ఎందుకు ఉక్రెయిన్, రష్యాలకు కేసీఆర్ అధ్యక్షుడు అవ్వొచ్చని ఎద్దేవా చేశారు. తమకు ప్రశాంత్ కిషోర్ లాంటి వారి అవసరం లేదన్నారు తరుణ్ చుగ్. అంతేగాక, ఏ కిషోర్‌లు కేసీఆర్‌ని కాపాడలేరు. కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోంది. కుటుంబ పాలన చేస్తున్న వారికే వ్యూహకర్తలు అవసరం. మా బూత్ ఇన్‌చార్జ్ బూత్ ఎలా గెలవాలి ప్లాన్ చేస్తాడు? మాకు పీకేలు అవసరం లేదు. తెలంగాణలో జరిగే పోరాటం బీజేపీ టీఆర్‌ఎస్‌ల మధ్యకాదు. కుటుంబ రాజకీయానికి. తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం. కేసీఆర్ ప్రధాని అని పగటి కలలు కంటున్నారు. కేసీఆర్ పొగొట్టుకుంది తెలంగాణలో వెతుకుతున్నది బయట. ప్రధాని మోడీ మీద ఇప్పటి వరకు ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేదన్నారు. కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారు. అద్దంలో తన ముఖం చూసుకొని మోడీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications