కేసీఆర్ ఎందుకు రాలేదు? షెడ్యూల్ ఏంటీ?: శాలువా తెచ్చానంటూ బండి సంజయ్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ ముగిసిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ్టి కేసీఆర్ షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూశామన్నారు బండి సంజయ్. కేసీఆర్‌కు సన్మానం చేసేందుకు శాలువా కూడా తీసుకువచ్చానని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం చెయిర్ కూడా వేశామన్నారు. దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్ ఎందుకు రారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ఆటంకం అని విమర్శించారు.

తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కావడానికి ప్రధాని మోడీ, రైల్వే మంత్రితోపాటు బీజేపీ నాయకులంతా హాజరయ్యారని సీఎం మాత్రం రాలేదని అన్నారు. ఇప్పుడు దీనికి జ్వరం వచ్చిందని అంటారా? కోవిడ్ వచ్చిందని అంటారా? అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి కారణం ఏంటో తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ చెప్పాలన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదని.. కుటుంబం, నియంత, అవినీతి పాలన అంతం కావాలన్నారు బండి సంజయ్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. ఇక ప్రధాని మోడీ సభను విజయవంతం చేసిన బీజేపీ శ్రేణులు, ప్రజలకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదిఇలావుంటే, బహిరంగ సభలో ప్రధాని మోడీ తెలంగాణ సర్కారుపై కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కుటుంబం, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతి ప్రాజెక్టు కూడా అవినీతి వల్ల ఆలస్యం అవుతుందన్నారు. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలన్నారు. కుటుంబం పాలన, అవినీతి వేర్వేరు కాదంటూనే.. ఇలాంటి వారిపై పోరాడాలా వద్దా అని ప్రజలను ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications