ఒవైసీ కాలేజీలో హెచ్ఓడీగా ఉగ్రవాది: బండి సంజయ్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంఐఎం, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందన్నారు సంజయ్. ఉగ్రవాదులకు ఎంఐఎం పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. గతంలో ఉగ్రవాదులకు మద్దతుగా ఒవైసీ మాట్లాడారన్నారు. పాతబస్తీలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని.. ఇందులో ఓ వ్యక్తి ఒవైసీకి చెందిన కాలేజీలో హెచ్ఓడీగా పనిచేస్తున్నాడని అన్నారు.
రాజకీయాల కోసం ఉగ్రవాద సంస్థలను ఎంఐఎం వాడుకుంటుందోని బండి సంజయ్ ఆరోపించారు. ఓట్ల కోసం ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ వాడుకుంటోందని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు అధికారమే కావాలని.. ప్రజల భద్రత అవసరం లేదన్నారు. హైదరాబాద్ ప్రజల భద్రతను బీఆర్ఎస్ గాలికి వదిలేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. ఉగ్రవాదుల కదలికలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసీఆర్ హింసించే పులకేశి అని ఎద్దేవా చేశారు. తాము సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చాలా మంది ఓవర్‌గా మాట్లాడారని.. అందులో ట్విట్టర్ టిల్లు కూడా ఉన్నారన్నారు. ఇప్పుడు ఏం జరిగిందని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సీఎం కేసీఆర్ సలహాదారుగా తీసుకున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నిరసన తెలుపుతున్న పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం బెదిరిస్తోందని మండిపడ్డారు.
ఆరో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన ఉగ్ర మూకల కదలికల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్న మరో వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ పరిధి బాలాజీ నగర్‌కు చెందిన మహమ్మద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరొకరి అరెస్టుతో మొత్తం అరెస్టైన వారి సంఖ్య ఆరుగురికి చేరింది.
అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తహరీర్(H-U-T)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసి స్థానిక న్యాయస్థానంలో హాజరుపర్చి భోపాల్‌కు తరలించారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ఏటీఎస్ పోలీసులు భోపాల్, హైదరాబాద్‌లలో ఏకకాలంలో దాడులు చేసి మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. నగరంలో అరెస్టైనవారిలో ఒకరు ప్రముఖ మెడికల్ కాలేజీలో హెచ్ఓడీగా, మరొకరు క్లౌడ్ సర్వీస్ ఇంజినీర్‌గా పనిచేస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications