మంత్రి పదవికి బండి సంజయ్ గుడ్ బై, కొత్త బాధ్యతలు- మోదీ మార్క్ మార్పులు..!?
తెలంగాణ కేంద్రంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్దం చేస్తోంది. రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిణామాలు అనుకూలంగా మారుతున్నాయనే అంచనాతో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. ఇక.. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల తరువాత కేంద్ర కేబినెట్ ప్రక్షాళన జరగనుంది. అందులో భాగంగా బండి సంజయ్ ను మంత్రిగా తప్పించి.. కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. బండి స్థానంలో సీనియర్ నేత పేరు రేసులో ఉంది.
కేంద్ర కేబినెట్ విస్తరణ
కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు - చేర్పులు చోటు చేసుకోనున్నాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా మార్పుల పైన పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ సారి కూర్పులో ఆరెస్సెస్ మార్క్ కనిపిస్తోంది. ఆగస్టు 15 తర్వాత బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రకటన చేయనున్నారు. అదే విధంగా ఉపరాష్ట్రపతి పదవి పైన కీలక కసరత్తు కొనసాగుతోంది. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కనుంది. కాగా, తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తనకు మంత్రివర్గం నుంచి విముక్తి కల్పించాలని కోరటం సంచలనంగా మారుతోంది.

మార్పులు - చేర్పులు
ఈ నెల 20వ తేదీ తరువాత కేంద్ర మంత్రివర్గాన్ని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. పలువురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని.. ముఖ్యంగా కొంతమంది మాజీ బ్యూరోక్రాట్లను పక్కన పెడతారని భావిస్తున్నారు. వారి స్థానంలో.. పార్టీలో చిరకాలం పనిచేసిన, సంఘ్‌కు సన్నిహితులైన వారికి స్థానం లభించనుంది. విదేశాంగమంత్రి జైశంకర్‌తో పాటు హర్దీప్ పురి, అర్జున్ రాం మేఘ్వాల్, అశ్వినీ వైష్ణవ్ వంటి వారి సేవల విషయంలో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరికి జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించాలనే ఆలోచన తో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్రప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లాద్ జోషి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

బండికి కీలక బాధ్యతలు
తనకు మంత్రి పదవి వద్దని.. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేయాలనుకుంటున్నానని నేరుగా ప్రధాని మోదీ.. అమిత్ షా కు బండి సంజయ్ కోరారు. మంత్రి గా బాధ్యతల కారణంగా పార్టీలో క్రియాశీలకంగా పని చేయలేకపోతున్నట్లు వారికి వివరించారు. ఆరెస్సెస్ పెద్దలు సైతం తెలంగాణలో బండి సంజయ్ పార్టీకి అవసరమని.. ఆయనకు పార్టీ బాధ్యతలే అప్పగించాలని సూచించినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రాంచందర్‌రావుకు అండగా బండి సంజయ్ విస్తృతంగా రాష్ట్ర పర్యటనలు చేపట్టేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. బండి సంజయ్ అభ్యర్ధన పట్ల ప్రధాని సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో, బండి స్థానంలో లక్ష్మణ్ కు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ కనిపిస్తోంది. వచ్చే వారం ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications