
గుంట నక్కలే గుంపులుగా.. రాజగోపాల్ రెడ్డి సింహం సింగిల్ గానే: బండి సంజయ్ తగ్గట్లేదుగా!!
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. రోడ్ షోలో పాల్గొంటున్న బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. మునుగోడు లో మా రాజగోపాల్ రెడ్డి హీరోలా ఉన్నాడని, మిగతా పార్టీల అభ్యర్థులు విలన్ల మాదిరిగా ఉన్నారని పేర్కొన్న బండి సంజయ్ ప్రజల కోసం పనిచేసే హీరోలు కావాలా విలన్లు కావాలా అంటూ ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది ఇందుకే
గుంట నక్కలు గుంపులుగా వస్తాయని.. సింహం సింగిల్ గానే వస్తుందని, రాజగోపాల్ రెడ్డి సింహం అంటూ బండి సంజయ్ కితాబిచ్చారు. కెసిఆర్ ఇక్కడికి వచ్చిరాచకొండలో ఫిలిం సిటీ కట్టిస్తా అన్నాడు, నారాయణపూర్ మండలంలోని పోడు భూముల సమస్య పరిష్కరిస్తా అన్నాడు, కానీ చేయలేదని, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్ వైఖరికి నిరసనగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడు అని చెప్పుకొచ్చారు. మునుగోడు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఎన్నికలు వచ్చాయని బండి సంజయ్ వెల్లడించారు.

కోమటిరెడ్డి రాజీనామాకు కారణం ఆ మొరుగుతున్న కుక్కలు తెలుసుకోవాలి
రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత చౌటుప్పల్ నుంచి నారాయణపూర్ రోడ్డు అయిందని, గట్టుప్పల్ మండలం అయిందని బండి సంధ్య పేర్కొన్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడో నియోజకవర్గం లో అక్కడక్కడ మొరుగుతున్న కుక్కలు తెలుసుకోవాలని ప్రత్యర్థి పార్టీల నాయకులు బండి సంజయ్ టార్గెట్ చేశారు.
ఈరోజు పోలీసుల తీరు దారుణంగా ఉందని, అమరులైన పోలీసుల ఆత్మలు ఘోష పెడుతున్నాయని పేర్కొన్న బండి సంజయ్ పోలీసులు ముఖ్యమంత్రి గడిల దగ్గర కొమ్ముకాస్తున్నారని, అధికార పార్టీ నేతల మోచేతి నీళ్లు తాగుతున్నారా అంటూ మండిపడ్డారు.

మునుగోడు ఉప ఎన్నిక మునుగోడుకు మాత్రమే వచ్చిన ఎన్నిక కాదు
బిజెపి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ సిబ్బంది గుర్తుపెట్టుకోవాలని రాబోయేది బిజెపి ప్రభుత్వం అన్నారు. తాము పోలీస్ వ్యవస్థ కు వ్యతిరేకం కాదని, కానీ అధికార పార్టీకి వత్తాసుగా పోలీసులు ప్రవర్తించడం మంచిది కాదని హితవు పలికారు. ప్రస్తుతం మునుగోడు కు వచ్చిన ఉప ఎన్నికలు, మునుగోడు కు మాత్రమే సంబంధించిన ఎన్నికలు కావని బండి సంజయ్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపిస్తే పేదల బతుకులు ఆగం అవుతాయని బండి సంజయ్ పేర్కొన్నారు

మీకు సిగ్గు లజ్జ ఉంటే నా సవాల్ స్వీకరించండి
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాని వాళ్ళందరూ , రుణమాఫీ జరగనోళ్లు,దళితులకు మూడెకరాలు రానోళ్లు, దళిత బందు రాని వాళ్ళు, పోడు భూముల సమస్యలు పరిష్కారం కానోళ్లు.. అన్ని కులాలు ఒకటై రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఓటును అమ్ముకోవద్దని పేర్కొన్న బండి సంజయ్ , గొల్ల కురుమలకు డబ్బులు రాకుండా తానే ఫ్రీజ్ చేయించానని దుష్ప్రచారం చేస్తున్నారని, మీకు సిగ్గు లజ్జ ఉంటే మీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే.. రేపు శివాలయం దగ్గరికి మీరు రండి నేను వస్తా ప్రమాణం చేద్దాం అంటూ సవాల్ విసిరారు. ఇది భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక కావడంతో, బిజెపికి ఓటు వేసి కెసిఆర్ అహంకారానికి బుద్ధి చెప్పాలన్నారు బండి సంజయ్.