బిజెపి సింహంలా.. సింగిల్ గా: బండి సంజయ్ తగ్గట్లేదుగా!!
ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఎంఐఎం పార్టీ ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దారుస్సలాంలో కూర్చొని బీరాలు పలకడం కాదు... నిజంగా మీకు సత్తా ఉంటే తెలంగాణ రాష్ట్రం అంతటా పోటీ చేయాలని బండి సంజయ్ ఎంఐఎం పార్టి నాయకులకు సవాలు విసిరాడు.
కరీంనగర్ లోని పద్మానగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీటీడీ కరీంనగర్ లో ఆలయం నిర్మించడం చాలా సంతోషం అని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా టీటీడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

బీజేపీ నాగుపాము, ఎంఐఎం ఉన్నన్ని రోజులు బీజేపీని అధికారంలోకి రానివ్వబోమంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ చేతగాని పార్టీ అని ఆ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. ఎంఐఎంకు అధికారంలోకి రావాలనే ఆలోచన లేదు కానీ పైసలు నింపుకోవాలని చూస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఎవరుంటే వాళ్లతో కలిసే పార్టీ అని, ముస్లింల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు.
నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదు? చెప్పాలన్నారు. ముస్లింలకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? కనీసం ముస్లింలకు పాస్ పోర్ట్ కూడా ఎందుకు రావడం లేదు? దీనిపై ఎంఐఎం నాయకులు సమాధానం చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. ఒవైసీ ఎంతసేపు ఆస్తులను కాపాడుకోవడానికే తపిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఎంఐఎంను ముస్లింలు చీత్కరిస్తున్నారు. ఆ పార్టీని నమ్మడంలేదని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక బిఆర్ఎస్ ను చంకనేసుకుని వస్తారో, కాంగ్రెస్తో కలిసి వస్తారో రండి.. బిజెపి సింహం లా సింగిల్ గా వస్తుందని ఎంఐఎంకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు .అసలు ఎంఐఎం పార్టీకి రాష్ట్రమంతటా పోటీ చేసే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. నిజంగా ఎంఐఎంకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications