ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి?: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ, ఉద్యమమేనంటూ వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని బండి సంజయ్ తన లేఖలో డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

317 జీవోతో ఉద్యోగుల్లో గందరగోళం: బండి సంజయ్
ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న 317 జీవో అమలును తక్షణమే నిలిపివేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ బహిరంగ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ (సర్దుబాటు) కోసం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే ప్రమాదముందని అన్నారు బండి సంజయ్.

ఏకపక్ష నిర్ణయాలంటూ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల స్థానికతను ప్రమాణీకంగా తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 3 ఏళ్లలోపు ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని 2018లో 124 జీవో జారీ చేసినా గడవు ముగిసేదాక సీఎం ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
తీరా గడువు ముగిసే సమయానికి హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగులను మరింత గందరగోళంలో పడేసిందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయ నిపుణులతో చర్చించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మరింత ఇబ్బందిపెట్టేలా టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలున్నాయని మండిపడ్డారు.

15 రోజుల డెడ్‌లైన్ అంటూ కేసీఆర్ సర్కారుకు బండి సంజయ్
కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలవల్ల భవిష్యత్తులో అనేక న్యాయపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఏర్పడిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ జీవోను యధాతథంగా అమలు చేస్తే పలు జిల్లాల్లో ఏళ్ల తరబడి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశమే లేకుండా పోయే ప్రమాదముందన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న 317 జీవో అమలును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల స్థానికత, సీనియారిటీ ఆధారంగా జిల్లాలకు సర్దుబాటు చేసే అంశంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించాలన్నారు. మొత్తం ఈ ప్రక్రియనంతా 15 రోజుల్లోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు బండి సంజయ్. నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని, లేనిపక్షంలో బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications