సిబిఐ కేసు, ఢిల్లీకి కెసిఆర్ పరుగు: రమణ సంచలనం, 'జైట్లీతో రహస్యాలు ఏంటి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిబిఐ కేసు నుంచి బయటపడేందుకే కెసిఆర్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. చండీయాగం పేరుతో కేంద్రం వద్దకు పరుగెత్తారన్నారు.
తెలంగాణ పైన అవగాహన లేని సాహ్నిని ప్రతినిధిగా నియమించారని మండిపడ్డారు. లోపాయకారి పనులకు సహకరించినందునే సాహ్నికి పదవి ఇచ్చారని మండిపడ్డారు. వెలుగుబంటి సూర్యనారాయణతో ఉన్న సంబంధాలను కెసిఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పైన నిషేధాన్ని విధించి 500 రోజులు గడుస్తోందని గుర్తు చేశారు. ఈ సంఘటన కెసిఆర్ రాచరీక, నయా పెత్తందారితనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం సాధించారు: పొన్నం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీకి వెళ్లి, ఈ మూడు రోజుల పర్యటన ద్వారా ఏం సాధించారని కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో కెసిఆర్ రహస్య మంతనాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని పెంచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారన్నారు.
ప్రభుత్వం రైతు, ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత కోదండ రెడ్డి మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు.












Click it and Unblock the Notifications