ఖమ్మం కాంగ్రెస్ సభపై ఢిల్లీ ఫోకస్- తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయం
ఖమ్మం: తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక్కడి ఈక్వేషన్స్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మరోవైపు బీజేపీలు ఎవరికి వారు సొంత వ్యూహాలు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ తలపెట్టనున్న జనగర్జన గురించే చర్చంతా జరుగుతోంది. కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే తరహా విజయాన్ని తెలంగాణలో నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో అందరి ఫోకస్ తెలంగాణపై ఉంది.
ఇక తెలంగాణలో అధికారం తప్పక చేపడాతమనే కాన్ఫిడెన్స్ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఆదివారం రోజున ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనగర్జన సభపై ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలో పుంజుకుందని భావిస్తున్న బీజేపీలో ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. దీంతో బీజేపీ గ్రాఫ్ పడిపోవడం ఆ తర్వాత కాంగ్రెస్ ఆ పొజిషన్‌ను హైజాక్ చేసింది. నేతలంతా ఒక్కటయ్యారు. దీంతో కాంగ్రెస్ అధికారం దిశగా అడుగులు వేస్తోందనే భావన ఇటు నేతల్లోను అటు క్యాడర్‌లోనూ కనిపిస్తోంది.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం భట్టి యాత్ర ముగింపు వేళ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. భట్టి చేపట్టిన పాదయాత్రకు ప్రజల్లో మంచి రెస్పాన్స్ రావడంతో రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఇక జనగర్జన సభలో సీఎల్పీ నేత భట్టిని సత్కరించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర చేపట్టినట్టు తెలుస్తోంది.ఈ పీపుల్స్ మార్చ్ నేతల మధ్య విబేధాలను తొలగించి అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చింది. క్యాడర్‌లో జోష్ నింపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైయస్ ఎలాగైతే అందరినీ ఒకేతాటిపైకి తన పాదయాత్రతో తీసుకొచ్చారో... అలానే భట్టి విక్రమార్క కూడా తన పాదయాత్రతో అందరినీ ఏకం చేశారు. భట్టి పాదయాత్రపై రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన్ను సత్కరించాలని రాహుల్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఖమ్మం సభ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మం చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి వైరా రోడ్డులోని ఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో వంద ఎకరాల స్థలంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేసారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అనూహ్యంగా తెలంగాణలో పుంజుకోవడంతో బీజేపీ నేతల్లో గందరగోళం నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది నేతలు పార్టీని వీడుతారనే ఆందోళన బీజేపీలో కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఖమ్మం సభకు వస్తుండటంతో బీజేపీ అగ్రనాయకత్వం ఈ సభను చాలా నిశితంగా పరిశీలించే అవకాశాలున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఖమ్మం సభకు తెలంగాణ ప్రభుత్వం అవాంతరాలు సృష్టిస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే జనగర్జన సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఖమ్మం సభ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications