శునకాలకు భోగిపళ్ళు .. జంతు ప్రేమికుల సంక్రాంతి వేడుకలు!!
సహజంగా సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగిగా జరుపుకుంటాం. భోగి నాడు పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ భోగి పండ్లను పోసి పెద్దలు దీవెనలు అందిస్తారు. ఇది తెలుగువారి సాంప్రదాయం. ఇలా భోగి పండ్లను తలపై పోయటం వలన వారిపై ఉండే నర దృష్టి తొలగిపోతుందని చెప్తారు .
ఎక్కడైనా సంక్రాంతి పండుగ నాడు పిల్లలకు భోగి పండ్లు పోయడం మాత్రమే మనకు తెలుసు కానీ వీధి కుక్కలకు కూడా భోగి పండ్లు పోయటం ఎక్కడా ఎవరూ విని ఉండరు. కానీ భోగి పండ్లు పోసి సంబరాలు జరుపుకుంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం. మానవ సంబంధాలు అంతంత మాత్రంగా ఉంటున్న నేటి రోజుల్లో జంతువులపైన ప్రేమతో కుక్కలకు భోగిపండ్లు పోసి సంబరాలు జరుపుకుంది ఓ కుటుంబం.

మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసల పల్లి గ్రామానికి చెందిన పింగళి దీపిక కుటుంబం జంతువులపై ప్రేమను కనబరిచే కుటుంబం. ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికే వందకు పైగా వీధి శునకాలను పెంచుతున్నారు. అయితే భోగి పండుగనాడు ఈ కుటుంబం పిల్లలతో పాటు పెంపుడు జంతువులకు, వీధి కుక్కల పిల్లలకు భోగి పళ్ళు పోసి తమ సరదా తీర్చుకున్నారు.
బంతిపూలు, రేగి పండ్లు, చిల్లర నాణేలతో వీధి కుక్కల పిల్లలకు భోగి పండ్లు పోసి హారతులు ఇచ్చి పాటలు పాడి వేడుకను నిర్వహించారు. శునకాలను ప్రేమిస్తూ ఆశ్రయం కల్పించడం వల్ల అవి మనపై విశ్వాసాన్ని కనపరుస్తాయని వారు చెబుతున్నారు .అవి కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మనతో కలిసి జీవనం సాగిస్తాయని అంటున్నారు. మూగజీవాలపై ప్రతి ఒక్కరూ ప్రేమను కనబరచాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications