ఉల్ఫాతో కేంద్ర, రాష్ట్రాల త్రైపాక్షిక ఒప్పందం: అస్సాంకు ‘బిగ్ డే’ అన్న అమిత్ షా
న్యూఢిల్లీ: అస్సాంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. అస్సాంకు చెందిన సాయుధ వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA)తో దీర్ఘకాలంగా జరిపిన చర్చలు ఫలించాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ద్వైపాక్షిక శాంతి ఒప్పందంపై శుక్రవారం సంతకాలు జరిగాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతోపాటు యూఎల్ఎఫ్ఏ(ఉల్ఫా) ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం అస్సాంలో దశాబ్దాల తిరుగుబాటు చర్యలకు తెరదించుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం అస్సాం చరిత్రలో మరిచిలోని రోజు అని అమిత్ షా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఉల్ఫా హింసాకాండ కారణంగా అస్సాం చాలా కాలంగా నష్టపోయింది, 1979 నుంచి ఈ హింసలో 10,000 మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా చెప్పారు. అస్సాంలోని అతి పురాతన తిరుగుబాటు గ్రూపు ఉల్ఫా హింసను విరమించుకోవడానికి, సంస్థను రద్దు చేయడానికి, ప్రజాస్వామ్య ప్రక్రియలో చేరడానికి అంగీకరించిందని షా చెప్పారు. ఒప్పందంలో భాగంగా అస్సాంకు భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒడంబడికలోని ప్రతి నిబంధనను పూర్తిగా అమలు చేస్తామని కేంద్రమంత్రి చెప్పారు.
ఇప్పుడు అస్సాంలో హింస 87 శాతం తగ్గిందని, మరణాలు 90 శాతం, కిడ్నాప్‌లు 84 శాతం తగ్గాయని కేంద్రమంత్రి చెప్పారు. ఈ ఒప్పందం "చారిత్రకమైనది" అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వం, నాయకత్వం కారణంగా ఇది ఫలించిందని పేర్కొన్నారు. అరబిందా రాజ్‌ఖోవా నేతృత్వంలోని ఉల్ఫా వర్గానికి, ప్రభుత్వానికి మధ్య 12 సంవత్సరాల బేషరతు చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు.
కాగా, ప్రత్యేక అస్సాం డిమాండ్‌తో 1979లో ఉల్ఫా ఏర్పడింది. తిరుగుబాటు పేరుతో ఆయుధాలను చేపట్టిన ఆందోళనకారులు అనేక విధ్వంస చర్యలకు పాల్పడటం మొదలు పెట్టారు. 1990లో ఉల్ఫాను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో శాంతి చర్చలకు సుదీర్ఘ ప్రయత్నాలు జరిగాయి. అరబింద రాజ్‌ఖోవా నాయకత్వంలోని ఉల్ఫా బృందం ఈ చర్చలకు 2011లో తొలిసారి ముందుకు వచ్చింది. అయితే, పరేశ్ బరుహా నేతృత్వంలోని ఉల్ఫా(స్వతంత్ర) వర్గం మాత్రం తాజా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం చైనా-మయన్మార్ సరిహద్దులో పరేశ్ బరుహా తలదాచుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications