ఫార్ములా ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలకంగా ఆ స్టేట్మెంట్!
ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుడు అయిన దాన కిషోర్ ను ఏడు గంటల పాటు ప్రశ్నించి ఆయన నుండి స్టేట్మెంట్ ను నమోదు చేశారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా అర్వింద్ కుమార్, కేటీఆర్ లకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన దాన కిషోర్
దాన కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వీరిద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుండి తీసుకున్న డాక్యుమెంట్లను కూడా వాళ్ళ ముందు ఉంచి విచారించే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే దాన కిషోర్ తెలంగాణ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నుండి డబ్బు బదిలీ అయినట్టుగా ఆయన ప్రభుత్వానికి తెలిపారు.

అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారే ప్రయత్నాలు
ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ అధికారులు దూకుడును పెంచుతున్నారు. ఇక మరోవైపు ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం . ఈ మేరకు అధికార వర్గాలలో కూడా జోరుగా చర్చ జరుగుతుంది.
ఫార్ములా ఈ రేస్ కేసుతో కేటీఆర్ కు తలనొప్పి
ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ ఆయన ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఇప్పటికే కేసు నమోదు కాగా ఆయనను అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసులో ఏవన్ గా కేటీఆర్, ఏ 2గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, ఏ 3గా హెచ్ఎండిఎ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. దీంతో ఈ కేసులో కీలకంగా పడుతున్న అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications