బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు: షరతులు విధించిన కోర్టు
హైదరాబాద్: బిగ్‌బాస్-7 విజేత ప్రకటన అనంతరం అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం, దాడి కేసులో అరెస్టయిన బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హజారుకావాలని కోర్టు ఆదేశించింది.
బిగ్ ఫైనల్స్ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం, దాడి ఘటనను పోలీసులు సుమోటాగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. బుధవారం వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నేడు కోర్టులో హాజరుపర్చారు.దీంతో కోర్టు వారికి రిమాండ్ విధించింది.

అదే సమయంలో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. మీడియాతో మాట్లాడకూడదని వారికి షరతు విధించింది కోర్టు.
ఆరోజు ఏం జరిగిందంటే?
బిగ్‌బాస్ 7 ఫైనల్స్ విజేత ప్రకటన నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్.. రాత్రి 12 గంటల సమయంలో స్టూడియోస్ నుంచి బయటకు వచ్చారు. దీంతో అభిమానులు ఘన స్వాగతం పలికారు.
అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ కూడా బయటకు వచ్చారు. ఈ సమయంలోనే ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం మొదలైంది. పలువురు అభిమానులు రెచ్చిపోయి అమర్‌దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. దీంతో పలు కార్లతోపాటు దాదాపు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి.గొడవ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అభిమానులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు.
ఈ ఘటనపై రెండు వేర్వేరు కేసులను జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించినందుకు కారణమైన బిగ్‌బాస్ విజేత ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల అద్దాలు పగుల గొట్టిన వారిపై ఫిర్యాదు చేసినట్లు ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేయడం సరికాదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ శాఖను కోరారు.
అయితే, తాము ర్యాలీ వద్దని చెప్పినా.. వినకుండా ర్యాలీ తీయడంతో ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసి.. తాజాగా అరెస్ట్ చేశారు. ప్రశాంత్‌ను అతని నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేయడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేయొద్దని కోరారు. తనపై కొందరు దుష్ఫ్రచారం చేశారని ప్రశాంత్ తెలిపారు. ర్యాలీ వద్దని పోలీసులు చెప్పినప్పుడు.. వారి మాటలు తనకు నిపించలేదని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications