రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. హైదరాబాద్ లో 17 వేల కోళ్లు పూడ్చివేత
తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఆ పౌల్ట్రీ సామర్థ్యం 36 వేల కోళ్లు కాగా, ఇప్పటికే వేలాది కోళ్లు మృతి చెందాయి. తాజాగా మరో 17 వేల కోళ్లను పూడ్చేసినట్లు రంగారెడ్డి జిల్లా పశువైద్య, పశు సంవర్థక శాఖ అధికారి డా.బాబు బేరి తెలిపారు. కోళ్ల ఫామ్ వద్ద సిబ్బందితో కలిసి మరికొన్ని కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మరోవైపు అబ్దుల్లాపూర్ మెట్ లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి, ఎవరైనా బర్డ్‌ఫ్లూ లక్షణాలతో ఉంటే వారి వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా వైద్యశాఖ సర్వేలెన్స్ అధికారి డా.అంబిక, అబ్దుల్లాపూర్‌మెట్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా.ప్రసన్న లక్ష్మి వైద్య బృందంతో గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు.

ఇక అబ్దుల్లాపూర్ మెట్ తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం,చిట్యాల మండల పరిధిలోని కోళ్ల షెడ్లలోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులకు సమాచారం అందుతోంది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో కోళ్లకు పరీక్షలు జరిపి వైరస్ సోకిన కోళ్లను పూడ్చివేసే పనిలో ఉన్నారు.
బర్డ్ ఫ్లూ వైరస్‌తో ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇటీవల రెండేళ్ల చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించింది. దీంతో బర్డ్ ఫ్లూపై తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.












Click it and Unblock the Notifications