బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కొండెక్కిన మటన్, చేపల ధరలు.. ఫుల్ డిమాండ్!
తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ భయం బాగా పెరిగిపోయింది మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి అని ఆందోళన చెందితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృత్యువాత పడటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇక ఆదివారం వస్తే కోడిని కొక్కరకో అనిపించే జనాలు చికెన్ షాపుల వైపే చూడడం మానేశారు.
చికెన్ ను పక్కకు నెట్టి మటన్, ఫిష్ పై పడ్డ జనాలు
చికెన్ ధర తగ్గించి అమ్ముతున్నప్పటికీ కొనేవాళ్ళు లేక చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు చికెన్ షాపుల వద్ద జనాలు కిటకిటలాడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక ఇదే సమయంలో మటన్, ఫిష్ వంటి వాటికి భారీగా డిమాండ్ పెరుగుతుంది. దీంతో మటన్, ఫిష్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

చికెన్ తినక 40 శాతం పడిపోయిన హోటల్స్ బిజినెస్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మటన్ ధరలు వెయ్యి రూపాయల మార్క్ దాటింది. ఇక ఫిష్ ధరలు కూడా 200 రూపాయలకు పైనే పలుకుతుంది. బర్డ్ ఫ్లూ భయాల నేపథ్యంలో మటన్ ,చేపల మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. జనాలు ఇళ్లల్లో వండుకోవడానికి మాత్రమే కాదు బిర్యాని పాయింట్లలోనూ , హోటళ్లలోనూ చికెన్ అంటే తినే నాధుడే లేకుండా పోయాడు. దీంతో హోటల్స్ బిజినెస్ 40 శాతం పడిపోయింది.
కొండెక్కిన మటన్, చేపల ధరలు
ఫుడ్ వ్యాపారులు కూడా చికెన్ వంటకాలను తగ్గించారు. గత వారం రోజులు వరకు 100 రూపాయలు కిలో ధర పలికిన చేపలు ప్రస్తుతం రెండు వందల నుంచి 350 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఇక 700 నుంచి 800 వరకు ధర ఉండే మటన్ వెయ్యి రూపాయలు వరకు అమ్ముడు అవుతుంది. బర్డ్ ఫ్లూ భయం బాయిలర్ కోళ్లకే నని జనం భావిస్తున్న క్రమంలో కొందరు నాటు కోళ్లను తినటానికి ఇష్టపడుతున్నారు.
నాటు కోళ్ళకు భలే గిరాకీ
నాటు కోళ్ళను తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారు. గతవారం కిలో నాటుకోడి ధర 500 రూపాయలు పలికితే ప్రస్తుతం 750 రూపాయలు పలుకుతోంది. ఇక ఇది మాత్రమే కాకుండా రొయ్యలు, పీతలు వంటి వాటిని కూడా ప్రజలు కొనుగోలు చేసి తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications