కేసీఆర్ వైఫల్యాలపై సరికొత్త అస్త్రం.. బీజేపీ డిజిటల్ ఉద్యమం: సాలు దొర.. సెలవు దొర!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ఒకపక్క బిజెపి అగ్రనేతలను రాష్ట్రంలోకి తీసుకువచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను టార్గెట్ చేస్తూనే, మరో పక్కన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను కూడా విపరీతంగా వాడుకుంటూ కెసిఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ నేతృత్వంలోని బిజెపి దండు ముందుకు సాగుతుంది.

కేసీఆర్ కుటుంబ పాలనకు కౌంట్ డౌన్ .. సెలవు దొర వెబ్ సైట్
తెలంగాణ రాష్ట్రం పై బిజెపి ఫోకస్ చేసింది అని చెప్పడానికి తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల జోరుగా సాగుతున్న బిజెపి అగ్ర నేతల పర్యటనలు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను కూడా హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించి తెలంగాణపై బిజెపి అగ్రనాయకత్వం దృష్టి సారించిందని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో కెసిఆర్ అసమర్థ పాలన పై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే, మరోపక్క సోషల్ మీడియాలోనూ కెసిఆర్ ను టార్గెట్ చేస్తుంది. తాజాగా కల్వకుంట్ల కౌంట్ డౌన్ అంటూ సాలు దొర.. సెలవు దొర పేరుతో ఒక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది బిజెపి. ఇక ఈ వెబ్సైట్ ద్వారా కెసిఆర్ కుటుంబ పాలనకు సెలవు పలకడానికి ఆసక్తి చూపే వారంతా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.

కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధాలను ఎండగట్టే పనిలో బీజేపీ
అంతేకాదు కెసిఆర్ యొక్క పాలనను ఈ వెబ్సైట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న కేసీఆర్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, కెసిఆర్ పాలనలో ఆగని పాలమూరు వలసలు, తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలపై స్పందించని కేసీఆర్ అంటూ టార్గెట్ చేస్తుంది. అంతేకాదు తెలంగాణ రైతులకు సంకెళ్లు పంజాబ్ రైతులపై మొసలి కన్నీళ్లు కారుస్తున్న కెసిఆర్, కెసిఆర్ పాలనలో అంపశయ్యపై ప్రజారోగ్యం, ఉద్యమ ద్రోహుల కే పదవులు కట్టబెట్టిన కెసిఆర్ అంటూ వెబ్సైట్లో పేర్కొంది.

సెక్రటేరియట్ లో కాలు పెట్టని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వద్దు
కెసిఆర్ అలసత్వంతో లబ్ధిదారులకు అందని సంక్షేమ పథకాలు, ప్రజల సొమ్ముతో కేసీఆర్ దుబారా పర్యటనలు, మహిళలకి భద్రత ఇవ్వడంలో విఫలమవుతున్న కేసీఆర్ సర్కార్, పాతబస్తీలో మజ్లిస్ అరాచకాలను అరికట్టడంలో విఫలమవుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ బిజెపి వెబ్ సైట్ ద్వారా టార్గెట్ చేస్తుంది. స్వరాష్ట్రంలోనూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపని కేసీఆర్, రాష్ట్ర పరిపాలనను నడిపించే సెక్రటేరియట్ లో కాలు పెట్టని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వద్దు అంటూ వెబ్ సైట్ ద్వారా ప్రజలను ఆలోచించేలా చేస్తోంది బిజెపి.

బీజేపీ డిజిటల్ ఉద్యమంతో టీఆర్ఎస్ కు తలనొప్పి .. పార్టీకి మైలేజ్ వస్తుందని ఆశాభావం
ఇక సోషల్ మీడియాలోనూ సాలు దొర సెలవు దొర అంటూ పెద్ద ఎత్తున టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రారంభించిన ఈ డిజిటల్ ఉద్యమం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. కెసిఆర్ పై చేపట్టిన వ్యతిరేక ప్రచారాన్ని ఆపకుంటే, తాము మోడీపై డిజిటల్ బోర్డులు పెట్టి, చెప్పుల దండలు వేస్తామని టిఆర్ఎస్ పార్టీ నాయకులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఇక బిజెపి చేపట్టిన ఈ డిజిటల్ ఉద్యమం పార్టీకి మైలేజ్ తీసుకువస్తుందని భావిస్తున్నారు. ప్రజలు కూడా కెసిఆర్ పాలన పై ఆలోచిస్తారని, వచ్చే ఎన్నికలలో తగిన సమాధానం చెబుతారని గట్టి నమ్మకంతో ఉన్నారు బీజేపీ నేతలు.












Click it and Unblock the Notifications