మాకు ఏమిచ్చారని మీకు ఓటేయాలి: రేవంత్ రెడ్డి ఫైర్
Revanth Reddy Wayanad: ఇంకో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల పర్వం మొదలు కాబోతోంది. ఏడు దశల్లో ముగిసే ఎన్నికలు ఇవి. తొలి విడత పోలింగ్ 19వ తేదీన షెడ్యూల్ అయింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
ఈ ఎన్నికల నేపథ్యంలో.. ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకున్నాయి.

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ. 2019 నాటి ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన వాయనాడ్ నుంచే పోటీకి మొగ్గు చూపారు. ముమ్మరంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీని పరిధిలోని వివిధ అసెంబ్లీ స్థానాల్లో రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ/ఎన్డీఏ కూటమిపై నిప్పులు చెరిగారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు అడిగే కనీస హక్కు బీజేపీకి గానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గానీ లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దక్షిణాదికి ఏమిచ్చారని ఓటు వేయాలని ప్రశ్నించారు. అబ్ కీ బార్ 400 పార్ అనే స్లోగన్ వినడానికి బాగానే ఉన్నప్పటికీ.. అన్ని సీట్లు రాబోవని ధీమా వ్యక్తం చేశారు.
తన 10 సంవత్సరాల హయాంలో దేశాన్ని మోదీ భ్రష్టు పట్టించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా భారత్‌లో అంతర్భాగమేనని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో మోదీ ఎందుకు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తోన్నారు?.. గుజరాత్‌కు కేటాయించిన బుల్లెట్ రైలును దక్షిణాదికి కూడా ఇస్తామని ఇప్పుడే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని నిలదీశారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ మంత్రి.. వంటి కీలక పదవుల్లో దక్షిణాది వారిని ఎంపిక చేశారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడో నిషేధించాయనీ పేర్కొన్నారు. వాయనాడ్‌లో పోటీలో ఉన్న ఎల్డీఎఫ్ అభ్యర్థికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని నిలదీశారు. బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు అండగా నిలిచారని విమర్శించారు.












Click it and Unblock the Notifications