తెలంగాణాకు బీజేపీ వ్యతిరేకం.. మోడీ వ్యాఖ్యలతో నిరూపితమైంది: ఆందోళనలకు మంత్రి ఎర్రబెల్లి పిలుపు
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ మంత్రులు మోడీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మోడీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు బిజెపి వ్యతిరేకమని మరోసారి రుజువైందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరం, ఆక్షేపణీయమని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

తెలంగాణాపై బీజేపీకి, మోడీకి ఎందుకంత అక్కసు
తెలంగాణపై బీజేపీకి, మోడీకి ఎందుకంత అక్కసు?అని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ సమాఖ్య స్ఫూర్తి కి మోడీ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. బిజెపికి ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం లేదని మోడీ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు.

అభివృద్ధి ఓర్వలేకే మోడీ అవమానకర వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న బిజెపి కాకినాడ తీర్మానం అర్థం ఏంటని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు.ఆనాటి నుండి బిజెపి తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ ఉందని, ఆనాడు మూడు రాష్ట్రాలను విభజించిన బిజెపి తెలంగాణ విభజనను ఎందుకు అడ్డుకుందని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. మోడీ మనసులోని మాట బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నిజ స్వరూపం ఇదే... మోడీ మాటలతో స్పష్టం
తెలంగాణ విభజనకు బిజెపి వ్యతిరేకం కాబట్టే విభజన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విభజన స్ఫూర్తితో లోయర్ సీలేరు ప్రాజెక్ట్ సహా, ఏడు మండలాలను 2014 లో ఆంధ్ర లో కలిపారని ప్రశ్నించారు.మోడీ ప్రధానమంత్రిగా ఉండి అలా మాట్లాడడం దురదృష్టకరమని, ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని ఎర్రబెల్లి ప్రశ్నించారు.
బీజేపీ నిజ స్వరూపం ఇదే అని మరోసారి ప్రధాని మోడీ మాటలతో స్పష్టమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణా రాష్ట్రం సాధించుకోవటం వల్లే తెలంగాణా అభివృద్ధి సాధ్యమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మోడీ తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

మోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలకు పిలుపు
ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం పట్ల రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నిరసనలు, నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. తీవ్ర నిరసనలు వ్యక్తం చేయాల్సిన భాద్యత ప్రతి తెలంగాణ పౌరులపై ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications