ఈటెల రాజేందర్ సంచలనం.. రాబోయే ఎన్నికల్లో పోటీ అక్కడే!!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీకి దిగబోతున్నట్లు భారతీయ జనతాపార్టీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్. ప్రస్తుతం ఆయన అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గజ్వేల్ నుంచి పోటీచేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలిపానని, అంగీకరించారని ఈటెల వెల్లడించారు. దీనికోసం ఇప్పటినుంచే నియోజకవర్గంలో సీరియస్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఏ తరహా ఎన్నికలైతే జరిగాయో అదే తరహాలో రాబోయే తెలంగాణ ఎన్నికలుంటాయని, సుబేందు అధికారిలాంటి సీన్ ఇక్కడ కూడా పునరావృతమవుతుందన్నారు. బెంగాల్ తరహాలో ముఖ్యమంత్రిని ఓడించాలన్నారు.
ఈటెల రాజేందర్ చేసిన ప్రకటనపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. గజ్వేల్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పటిష్టంగా ఉందని, ఈటెల మళ్లీ అక్కడ గ్రామ గ్రామానికి, వార్డు వార్డుకు కొత్తగా పనిచేసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. తృణమూల్ భారీ విజయాన్ని సాధించింది. గత ఎన్నికలకంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ మమతాబెనర్జీ మాత్రం ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆరు నెలలకు భవానీనగర్ నుంచి పోటీచేసి ఏకపక్షంగా విజయం సాధించారు.

సుబేందు అధికారి తృణమూల్ లో నెంబర్ టూ స్థానంలో కొనసాగేవారు. ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకున్న బీజేపీ తన పార్టీలోకి ఆహ్వానించి ఎన్నికలు రసవత్తరంగా సాగేలా చూశారు. వారు అనుకున్న ఆశయం నెరవేరనప్పటికీ నెంబర్ టూ స్థానంలో నిలిచారు. అలాగే ఇక్కడ ఈటెల రాజేందర్ ను కూడా సుబేందు అధికారితో విశ్లేషకులు పోలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ టీఆర్ఎస్‌కు గట్టి పోటీనివ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications