బీజేపీకి మరో షాక్ తప్పదా?: పొంగులేటితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటితో రాజగోపాల్ రెడ్డి భేటీ చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన సోదరుడైన రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కాగా, కొంత కాలంగా క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన బీజేపీని వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవడంతో ఆ ప్రచారానికి బలాన్నిచ్చినట్లయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications