బీజేపీకి షాక్: కేటీఆర్, హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి రమాకాంత్ రావు
హైదరాబాద్: సిరిసిల్లలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్‌రావు బీజేపీకి రాజీనామా చేశారు. అంతేగాక, తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఆవునూరి రమాకాంత్‌రావు మాట్లాడుతూ.. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆవునూరి రమాకాంత్‌రావు.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.

బీజేపీలో పైకి కనబడేది సిద్దాంతం.. లోపల అన్నీ గ్రూపు రాజకీయాలేనని రమాకాంత్ రావు విమర్శించారు. బండి సంజయ్ నాయకత్వాన్ని నమ్ముకుని బీజేపీలో చేరామని, కానీ తమకు అన్యాయం జరిగితే ఆయన నోరు మెదపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక నాయకులతో చర్చించకుండా నర్సంపేటకు చెందిన రాణి రుద్రమకు సిరిసిల్ల టికెట్ ఇవ్వడమేంటని రమాకాంత్ రావు ప్రశ్నించారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై మనస్తాపంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. గ్రూపు రాజకీయాలు తట్టుకోలేకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో పలువురు నేతలు చేరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా చిట్యాల మండలం వెలినినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 50 కుటుంబాలు ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో టేకుల మల్లారెడ్డి, టేకుల రాజిరెడ్డి, ఏనుగు అనిల్ రెడ్డి, పైళ్ల రఘువీరా రెడ్డి, సామకురి శంకరయ్య, గోలి యాదయ్య, పైళ్ల వాసుదేవా రెడ్డి, మధుసూధన్ తదితరులు ఉన్నారు. మరోవైపు, నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామానికి చెందిన పెడ్డగౌడ్, వంగాల శంకర్ గౌడ్, ఉగ్గపల్లి శ్రీను, ఉగ్గపల్లి లోకేష్ ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications