బీజేపీకి షాక్: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన తుల ఉమ
హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. వేములవాడ నుంచి టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ (Tula Uma) ఆ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. అనంతరం ఆమె తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు తుల ఉమ. మంత్రి కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాగా, వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి తుల ఉమ బీజేపీ టికెట్ ఆశించారు.అయితే, చివరి లిస్టులో తుల ఉమ పేరు ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం తర్వాత మార్పులు చేసింది.

చివరి నిమిషంలో తుల ఉమ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి.. చెన్నమనేని వికాస్‌రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు తుల ఉమ. తనకు అన్యాయం జరిగిన పార్టీలో ఉండబోనని స్పష్టం చేసిన తుల ఉమ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నేతలు.. తమ పార్టీలోకి రావాలని ఆమెను ఆహ్వానించారు.
చివరకు మంత్రి కేటీఆర్ తోపాటు వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మడ లక్ష్మీనరసింహరావు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ క్రమంలో తన అనుచరులతో సమావేశమైన తుల ఉమ.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేసిన తుల ఉమ.. గతంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరారు తుల ఉమ. కాగా, అన్ని పార్టీల్లోనూ ఇలా జరుగుతున్న విషయం తెలిసిందే. టికెట్ ఆశించిన నేతలు తమకు దక్కకపోవడంతో మరో పార్టీలోకి చేరుతున్నారు. మరికొందరు స్వతంత్రంగా పోటీ చేస్తామని చెబుతుండగా.. ఇంకొందరు సైలెంట్‌గా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications