రాములమ్మకు కాంగ్రెస్ భారీ ఆఫర్ -ముహూర్తం ఫిక్స్..!?
తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీకి వరుస షాక్ లు తప్పటం లేదు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ వీడి తిరిగి సొంత గూటికి చేరారు. ఈ లిస్టులో ఇప్పుడు ఫైర్ బ్రాండ్, మహిళా నేత విజయ శాంతి చేరుతున్నారు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న రాములమ్మతో కాంగ్రెస్ ముఖ్య నేతలు మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ నుంచి భారీ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు ముహూర్తం సైతం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లోకి వలసలు: బీజేపీకి మరో షాక్ తప్పేలా లేదు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వ్యూహం బెడిసి కొడుతోంది. కొత్త నేతలు చేరకపోగా..ఉన్న నేతలే పార్టీని వీడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ తరువాత ఇప్పుడు రాములమ్మ అదే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రాములమ్మ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్నా ఎక్కడా ఖండనలు లేవు. ఎన్నికల వేళ బీజేపీలోనూ యాక్టివ్ గా లేరు. తొలుత రాములమ్మ అసెంబ్లీ బరిలో ఉంటారని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ, అభ్యర్దుల ఎంపిక ప్రక్రియలో విజయశాంతి ప్రస్తావన లేదు.
విజయశాంతి అదే రూటులో: ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరు ముఖ్య నేతలు వరుసగా విజయశాంతితో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా విజయశాంతి చేసిన ట్వీట్ సైతం తన మనసులో మాట ఏంటో స్పష్టం చేసేలా ఉంది. కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు కొందరు కాంగ్రెస్‌లో చేరాలని కోరుతున్నారని.. మరికొందరు బీజేపీలోనే ఉండమంటున్నారని ట్వీట్‌లో రాసుకొచ్చారు.
అయితే ఇద్దరి అభిప్రాయం తెలంగాణ మేలు కోసమేనని.. సినిమాల్లో లాగా రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ , అమిత్ షా,కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించినప్పటికీ ఎక్కడా రాములమ్మ కనిపించలేదు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన నాటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు.
రాములమ్మకు కాంగ్రెస్ ఆఫర్: అటు బీజేపీ నాయకత్వం సైతం విజయశాంతి పార్టీ వీడటం ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కడా బుజ్జగించే చర్యలు కనిపించటం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ లోకి రావటం ద్వారా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించటంతో పాటుగా వచ్చే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
దీంతో, బీజేపీకి రాజీనామా చేసి ఈ నెల 7వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు రాములమ్మ సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు లేదా రేపు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో, విజయశాంతి విషయంలో బీజేపీ చివరి నిమిషంలో ఏమైనా స్పందిస్తుందా..ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి.












Click it and Unblock the Notifications