తెలుగు భక్తుల కష్టాలు: శబరిమలలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలంటూ రేవంత్‌కు రాజా సింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లిన లక్షలాది మంది భక్తులు, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అయ్యప్పస్వాములకు అన్నప్రసాదం చేద్దామన్నా కేరళ ప్రభుత్వం అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాగునీరు, పార్కింగ్ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని రాజా సింగ్ తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సీఎం రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయని.. కేరళ సీఎంతో మాట్లాడి భోజన, వసతి, తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ తరహాలో కేరళల కూడా ఐదు నుంచి పదిహేను ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని రాజాసింగ్ తెలంగాణ సర్కారును కోరారు. తెలంగాణ భవన్ నిర్మిస్తే అక్కడ అయ్యప్ప స్వాములు బస చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ నుంచి వెళ్లిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాజాసింగ్ రేవంత్ సర్కారును కోరారు.
కేరళ సర్కారుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ.. కేరళలోని విజయన్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
చాలా మంది భక్తులు అయ్యప్ప ఆలయానికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కేరళ ప్రభుత్వం భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కనీసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలైన తమ రాష్ట్రాలకు చెందిన భక్తుల కోసం తాగునీరు, బస, భోజనం కోసం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications