తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ - 60 మందితో సిద్దం : అమిత్ షా టూర్ తో మొదలు..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ..ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. ఈ ఏడాది చివల్లో లేదా వచ్చే జనవరిలో గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగ నున్నాయి. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల్లో కార్యాచరణ ప్రారంభించిన బీజేపీ అధినాయకత్వం..ఈ సారి దక్షిణాదిలో తెలంగాణ పైన ఆశలు పెట్టుకుంది. దుబ్బాక..గ్రేటర్ హైదరాబాద్..హుజూరాబాద్ ఫలితాలతో బీజేపీలో తెలంగాణలో అధికారం పైన కష్టపడితే..సాధ్యమేననే అభిప్రాయంతో ఉంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత ...ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం..ప్రధాని మోదీ.. బీజేపీ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

ఆపరేషన్ ఆకర్ష్ - అభ్యర్ధుల ఖరారు
కేసీఆర్ జిల్లాల పర్యటనలు..వరుస నిర్ణయాలతో ముందస్తు ఎన్నికలు తప్పవా అనే చర్చ మొదలైంది. బీజేపీ - కాంగ్రెస్ నేతలు ముందస్తు ఖాయమని నమ్ముతున్నారు. దీంతో..బీజేపీ తెలంగాణలో ముందుగానే అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. పార్టీ తమ అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్షన్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైనా దాదాపుగా 60 స్థానాల్లో తమ అభ్యర్ధులు ఎవరనేది ఇప్పటికే బీజేపీ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక 17 లోక్ సభ నియోజకవర్గాల్లో నూ పోటీ చేసే అభ్యర్ధుల పైన కసరత్తు కొనసాగిస్తోంది. అభ్యర్ధులను ముందుగానే ఎంపిక చేయటం ద్వారా...పార్టీలో చివరి నిమిషం వరకు అభ్యర్ధుల అంశంలో నిరీక్షణ లేకుండా.... ప్రచారానికి - నియోజకవర్గం లో ప్రచారం తో ప్రజలకు దగ్గరయ్యేందుకు అభ్యర్ధులకు సమయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

అగ్ర నేతల పర్యటనతో షురూ
అదే సమయంలో ముఖ్య నేతలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఎస్సీ, 12 ఎస్టీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో... ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలకు ఛైర్మన్‌లు, సభ్యులను నియమించింది. పార్టీలో చేరికల పైనా ఫోకస్ పెట్టింది. ఈ నెలాఖరులో జనగామలో జరిగే పార్టీ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు.
వచ్చే నెలలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టనున్నారు. దీనిని అమిత్ షా ప్రారంభిస్తారు.

అమిత్ షా సమక్షంలో కీలక నేతల చేరికలు
అదే రోజు జనగామ లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభలోనే టీఆర్ఎస్.. కాంగ్రెస్ నుంచి పలువురు బీజేపీలో చేరుతారని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్..కాంగ్రెస్ నుంచి జిల్లాల్లో పట్టు ఉన్న కీలక నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఇప్పటికే బీజేపీ నేతలు సమావేశం అయ్యారు.
అదే విధంగా నల్గొండ జిల్లాలోనూ ముఖ్య నేతలు కాషాయం కండువా కప్పుకోవటానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఖమ్మంలో అధికార పార్టీలోని అసంతృప్త నేతలు సైతం కమలం గూటికి చేరుతారని బీజేపీలోని ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇక.. ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తోంది.

టార్గెట్ టీఆర్ఎస్ - లక్ష్యం చేరేనా
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, ఇంఛార్జ్‌లతో నిర్వహించే ఈ సమావేశానికి... భాజపా జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ ముఖ్య అతిధిగా రానున్నారు. జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జ్‌లతో బండి సంజయ్ హైదరాబాద్‌లో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసారు.
అమిత్ షా పాల్గొనే బహిరంగ సభలో పార్టీలో చేరికలతో పాటుగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరించేందుకు కమలం పార్టీ నేతలు సిద్దం అవుతున్నారు. మరి..సీఎం కేసీఆర్ వ్యూహాలకు ధీటుగా.. కమలం నేతలు అమలు చేసే కార్యాచరణ ఎంత వరకు సక్సెస్ అవుతాయనేది తేలాల్సి ఉంది. దీంతో..ఇక, రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications