సాంప్రదాయం ఉట్టిపడేలా తెలుగు రాష్ట్రాల స్పెషల్ వంటకాలతో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా సాగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

నోవాటెల్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నేతృత్వంలోని నాయకులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్ జూలై 2 మరియు 3 తేదీల్లో హెచ్ఐసిసి-నోవాటెల్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ కోసం గత రెండు రోజులుగా మేధోమథన సమావేశాలను నిర్వహిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

నోవాటెల్ వద్ద సమావేశ స్థలిని పరిశీలించిన బీజేపీ నాయకులు
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్, సీనియర్ నాయకులు పి.మురళీధర్ రావు, ఎస్.మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సిహెచ్. రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ఎన్. ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపి జితేందర్ రెడ్డితో పాటు పలువురు ఇప్పటికే సమావేశాలు జరగనున్న మాదాపూర్ నోవాటెల్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

వివిఐపిల కోసం ప్రత్యేక లాంజ్‌లు, హోటల్‌లో పార్టీ 200 కి పైగా గదులు రిజర్వ్
ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వంటి వివిఐపిల కోసం ప్రత్యేక లాంజ్‌లు, భోజన ప్రాంతం మరియు ఇతర వివరాలపై బిజెపి నాయకులు చర్చించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించడానికి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్న ఈ సమావేశానికి హోటల్‌లో పార్టీ 200 కి పైగా గదులను రిజర్వ్ చేసినట్లు చెబుతున్నారు.

సాంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు..తెలంగాణ-ఆంధ్ర వంటకాలతో అతిథులకు ఆతిధ్యం
ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రముఖులకు స్వాగతం పలకాలని రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంది. ఒకరోజు పూర్తిగా తెలంగాణ-ఆంధ్ర వంటకాలతో అతిథులకు ప్రత్యేక ఆతిధ్యం ఇవ్వాలని కూడా సమావేశాల నిర్వహణకు 34 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కమిటీలు వేసి ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఈ కమిటీలను అన్నింటినీ రాష్ట్ర నేతలు బండి సంజయ్, డాక్టర్ కె.లక్ష్మణ్, మంత్రి శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షిస్తారు.
Recommended Video


రాష్ట్రపతి ఎన్నికల నేపధ్యంలో సమావేశాలపై ఆసక్తి..
ఇక జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్ల పరిశీలనకు ఈనెల 14వ తేదీన జాతీయ నేతలు మళ్లీ రాష్ట్రానికి రానున్నారు. అప్పటికల్లా మొత్తం కమిటీ లకు సంబంధించిన బ్లూప్రింట్ ను సమర్పించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం దృష్టిని ఆకర్షించేలా, వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో నిర్వహించ దలచిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో బిజెపికి మైలేజ్ తీసుకువచ్చేలా నిర్వహించాలని భావిస్తున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది అందుకే ఇప్పటి నుండే ముమ్మర కసరత్తులు చేస్తున్నారు బిజెపి నాయకులు.












Click it and Unblock the Notifications