హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 24 నుంచి: రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆగస్టు 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా పేరు నిర్ణయించారు.

శుక్రవారం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ నేతలు బాబు మోహన్, డాక్టర్ చంద్రశేఖర్, బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, స్వామి గౌడ్, గంగిడి మనోహర్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్ర పేరును ప్రకటించారు. ఆగస్టు 24న భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుందని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు.

BJP Telangana president Bandi Sanjays padayatra is named as Praja Sangrama Yatra, starts from Aug 24th: Raja Singh

'కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. ప్రజలను మోసం చేశారు. ఈ మోసాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు ఎదురు నిలిచే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. ప్రజలలోకి ఈ విషయాన్ని తీసుకెళ్లడమే ఈ పాదయాత్ర లక్ష్యం. తెలంగాణాను అప్పుల తెలంగాణాగా ఎలా మార్చారో ప్రజలకు వివరించబోతున్నాం. తెలంగాణలో 2023లో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇది నేను చెప్పడంలేదు. ప్రజలు అనుకుంటున్న విషయం మీకు చెప్తున్నాను' అని రాజాసింగ్ తెలిపారు.

భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఆగస్టు 9నే పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేయడంతో ఎంపీ బండి సంజయ్ తప్పనిసరిగా ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. ఈ ఈ కారణంగానే బండి సంజయ్ పాదయాత్రను ఆగస్టు 24 నుంచి చేపట్టాలని నిర్ణయించారు.

ఉపఎన్నికల నోటిఫికేషన్ విదులయ్యాకే హుజూరాబాద్ నియోజకవర్గంలో సంజయ్ పాదయాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వారం రోజులపాటు ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలావుండగా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆగస్టు 16 నుంచి రాస్ట్రంలో యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలోనూ సంజయ్ పాల్గొనాల్సి ఉండటంతో.. సంజయ్ పాదయాత్ర ఆగస్టు 24కు వాయిదా పడింది. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆగస్టు 16న రాష్ట్రానికి వస్తున్న కిషన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఈటల రాజేందర్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, ఇతర మంత్రులపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గురువారంనాడు కేసీఆర్, హరీశ్ రావులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈటల.

గురువారం జమ్మికుంటలో పర్యటించిన సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తన విమర్శల దాడిని కొనసాగించారు. హుజూరాబాద్‌ను తన శాయశక్తులా అభివృద్ధి చేశానని అన్నారు. హుజూరాబాద్‌లో పెద్దగా పెండింగ్ పనులే లేవన్నారు. చేసిన పనులకు చాలా మందికి బిల్లులు రావడం లేదన్నారు. తనకు బీజేపీ నేతల నుంచి పూర్తి సహకారం ఉందన్నారు. తనది కారు గుర్తు అని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుగా ఉంటే.. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రైతు బంధు తెలంగాణ మొత్తం అమలు చేసి.. దళిత బంధును హుజూరాబాద్‌లోనే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. తనకు ఓటేస్తే పథకాల నుంచి పేర్లను తొలగిస్తామని టీఆర్ఎస్ నేతలు ప్రజలను బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అది అవాస్తవమని.. దుబ్బాకలో అలాగే చేశారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో డబ్బులు పంచడానికి హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు అమ్మేశారని అన్నారు. మూడు నెలల నుంచి ప్రచారం చేస్తున్నాను, ఎన్నికల్లో గెలిచేది తానేనంటూ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

హరీశ్ రావు ఎంత పనిచేసినా.. సీఎం కేసీఆర్ అతడ్ని నమ్మరని ఈటల వ్యాఖ్యానించారు. ఏనాటికైనా టీఆర్ఎస్‌ను కైవసం చేసుకోవాలని హరీశ్ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. అది సాధ్యం కాదన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే హరీశ్ రావును చరిత్ర క్షమించదని అన్నారు. చిల్లర ఆరోపణలు, చౌకబారు ప్రచారాలు చేయొద్దన్నారు. ధర్మం, న్యాయానికి విరుద్ధంగా పనిచేస్తే ప్రజల్లో చులకన అవుతామన్నారు. హరీవ్ రావుతో తనది 18 ఏళ్ల అనుబంధమని, అవన్నీ మర్చిపోయి సీఎం దగ్గర మార్కుల కొట్టేసేందుకు ఇవన్నీ చేయొద్దని ఈటల హితవు పలికారు. హరీశ్ రావు మోసపూరిత మాటలు హుజూరాబాద్ ప్రజలు నమ్మరని అన్నారు. దుబ్బాకలో ఎంత ప్రచారం చేసినా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినట్లు బుద్ది చెప్పారన్నారు. హుజూరాబాద్‌లోనూ అదే జరుగుతుందన్నారు.

'ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రి అయిన వాడివి నువ్వు. మీ మామ నియోజకవర్గంలో నువ్వు వరుసగా గెలుస్తున్నావు. కానీ, నేను అలాకాదు. ఒక్క అవకాశం ఇస్తే.. ఓటమి లేకుండా ప్రజల ప్రేమను పొందిన వాడిని. హుజూరాబాద్ లో అభివృద్ది జరగలేదు అంటున్నారు. నువ్వు నిన్న తిరిగిన 4 లైన్ రోడ్లన్నీ నేను వేయించినవే.
అభివృద్ది విషయంలో మీకు ఎంత సోయి ఉందో.. నాకూ అంతే సోయి ఉంది. ఆగష్టు 3, 2018న 50 మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు నేను ఇచ్చిన. ఈ రోజు మీరు ఓట్ల కోసం ఇస్తున్నారు. హుజూరాబాద్ లో 3900 ఇండ్లు మంజూరు అయ్యాయి. జమ్మికుంటలో, హుజూరాబాద్లో, కమలాపూర్ లో 500 ఇండ్లు కట్టించాను. ఇంకో 500 ఇండ్లు ధర్మారం, కోరుకల్, చిన్న ముల్కనూర్‌లో కట్టించాను. సిద్దిపేటలో, గజ్వేల్లో, సిరిసిళ్ళలో డబుల్ బెడ్ రూమ్ లు కడుతుంది కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్స్ కాదా. తెలంగాణ ఏర్పడిన తరువాత హుజూరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన. 18 చెక్ డ్యామ్ లు కట్టినం. రూ. 1050 కోట్లతో ఎస్ఆర్ఎస్పీ కాలువలు బాగుచేయించిన. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలకు చేరో రూ. 40 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే.. వాటిని మంజూరు కాకుండా కేటీఆర్ ఆపారు. ఆ డబ్బులను ఇప్పుడు మంజూరు చేసి.. కొత్తగా ఇస్తున్నట్టు జీవో ఇచ్చారు' అని ఈటల రాజేందర్ చెప్పారు.

'వందల కోట్లతో ఓట్లను కొన్నవాడిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది
ఉప ఎన్నికలో గెలవాలని ఇప్పటికే 192 కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో ఖర్చు పెట్టారు. నాతో పాటు 11 మంది సొంత పార్టీ నేతలను ఓడ గొట్టడానికి కేసీఆర్ ప్రతిపక్ష నేతలకు డబ్బులు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయి. 17 శాతం మంది జనాభా ఉన్న ఎస్సీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు? వెలమలకు ఎన్ని పదవులు ఇచ్చారు? మూడు సార్లు ప్రగతి భవన్ గేట్ దగ్గర మమ్ముల్ని ఆపారు. టీఆర్ఎస్‌లో 2016 నుంచే బానిస బతుకులు మొదలయ్యాయి. మంత్రులకు కూడా సీఎం దగ్గర అపాయింట్మెంట్ లేదని ఆపితే.. ఇదే కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్.. ఇంత అహంకారమా? ఇంత దొరతనమా? కరీంనగర్ నుంచే మళ్ళీ ఉద్యమం రావాలి అని ఆనాడు అన్నారు. ఈ రోజు ఇక్కడ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అని పెట్టుకో అని గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్ కుమార్‌కి ఆనాడే చెప్పిన. దమ్ము ఎవరికి ఉందో తెలుసుకోండి. నా పదవి కంటే నా ఆత్మ గౌరవం గొప్పది. వందల కోట్లతో ప్రజలను కొనడానికి పునాది వేసిన వాడిగా కేసీఆర్ మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది' అని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.

English summary
BJP Telangana president Bandi Sanjay's padayatra is named as 'Praja Sangrama Yatra', starts from Aug 24th: Raja Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X