అది బీజేపీ నేతల పగటి కలే!
తెలంగాణ భారతీయ జనతా పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి ఎప్పటికీ రాదని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను చూసి బీజేపీ నాయకులు అమితానంద పడుతున్నారన్నారు. అయితే, తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ గెలవలేదని ఆయన జోస్యం చెప్పారు.

ఢిల్లీ ఎన్నికలతో పోల్చుతూ బీజేపీ నాయకులు ఆనందపడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయన్నారు. ఈ పరిస్థితికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే కారణమని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు దక్కించుకుని విజయఢంకా మోగించింది. ఇక, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు ఇచ్చారంటూ చురకలంటిస్తున్నారు. దీంతో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు వారికి కౌంటర్లు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications