ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు: విస్తృత తనిఖీలు, చివరకు ఏం తేల్చారంటే?
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్‌లో బాంబు ఉన్నట్లు ఓ అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకొని అడుగడుగున విస్తృత తనిఖీ చేపట్టాయి.
విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ హుటాహుటిన ప్రజాభవన్‌కు తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు.

అదేవిధంగా భట్టి విక్రమార్క కాన్వాయ్ వాహనాలు, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఆ తర్వాత ప్రజాభవన్లో ఉన్న అమ్మవారి ఆలయంలో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, చివరకు ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు.
ఇక, ప్రజాభవన్‌లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్ ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయా? లేక కావాలని ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్ లో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో ప్రజాభవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.












Click it and Unblock the Notifications