హైదరాబాద్‌లో అతిపెద్ద ఫార్మా క్లస్టర్! అమెరికన్ సంస్థ రూ. 800 కోట్ల పెట్టుబడి: కేటీఆర్
తెలంగాణ రాజధాని మరో భారీ పెట్టుబడి వస్తోంది. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని మరో భారీ పెట్టుబడి వస్తోంది. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రిస్టల మేయర్స్ సంస్థ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు.

హైదరాబాద్‌లో అమెరికా సంస్థ రూ. 800 కోట్ల పెట్టుబడి
రూ. 800 కోట్లకుపైగా పెట్టుబడితో ముందుకొచ్చిన ఈ సంస్థ ద్వారా 1500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా బ్లిస్టల్ మేయర్స్ సంస్థ ప్రతినిధులకు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం బయోటెక్నాలజీ, ఐటీకి గొప్ప ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రపంచంలోనే టాప్ టెన్ ఫార్మాసుటికల్ కంపెనీల్లో బీఎంఎస్ ఒకటని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వారిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

తెలంగాణ-బీఎంఎస్ మధ్య ఎంవోయూ, 1500 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్ నగరంలో ఉన్న మానవ వనరుల నైపుణ్యం బ్రిస్టల్ మేయర్స్ సంస్థ కార్యకలాపాలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నా. 2028 నాటికి రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ ఏకో సిస్టం విలువను రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ రోజు బీఎంఎస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. లైఫ్ సైన్సెస్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ఈ సంస్థ ఏర్పాటు ఒక గొప్ప అవకాశమని మంత్రి కేటీఆర్ అన్నారు.
తాజా ఎంఓయూ ద్వారా 1,500 మందిని నియమించుకుంటామన్న బీఎంఎస్ కంపెనీ త్వరలోనే తమ లక్ష్యాన్ని చేరుకొని మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న నమ్మం తమకు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్న అమెరికా సంస్థ ప్రతినిధులు
కాగా, హైదరాబాద్ నగరం గత ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని బీఎంఎస్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐదేళ్ల కిందట తాము హైదరాబాద్ వచ్చినప్పుడు పరిస్థితి గుర్తు చేసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మౌలిక వసతుల విషయంలో నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. తమ సంస్థ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించబోతోందని బీఎంఎస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. రానున్న మూడు సంవత్సరాల్లో తమ కంపెనీ సుమారు 1500 మంది ఉద్యోగులను నియమించుకుంటుందని.. 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications