ట్విట్టర్ వాడకంలో అన్నా చెల్లెలు పోటీ.!రాహుల్ నుండి అమీత్ షా వరకూ కేటీఆర్,కవిత ట్వీట్ల ఉప్పెన.!
హైదరాబాద్ : రాజకీయ నాయకులకు సోషల్ మీడియా పదునైన ఆయుధంగా పరిణమించింది. ఎవరి నైపుణ్యాన్ని బట్టి వారు ప్రసార మాద్యమాల వాడకంలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. కీలక సమాచారాన్ని తక్షణం ప్రజలకు చేరవేసేందకు ప్రధాన ప్రసారమాద్యమం కాకుండా ప్రత్యామ్నాయ వేదికైన సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం రాజకీయ నేతలకు అలవాటుగా మారింది. ఈ నేపధ్యంలోనే రాజకీయ పరస్పర ఆరోపణలకు, సవాళ్లకు సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారింది. కాగా ఇదే సోషల్ మీడియాను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత బాగా వాడుతున్నట్టు చర్చ జరుగుతోంది.

పోస్టులలో పోటీ.. జాతీయ నేతలకు కవిత,కేటీఆర్ ట్విట్టర్ ఎటాక్
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమారుడు, కుమార్తె మద్య గట్టి పోటీ నడుస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో వీరిద్దరిదీ కీలక పాత్రగా ప్రజల్లో చర్చ నడుస్తుంటుంది. తెలంగాణ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తుంటారు ఈ అన్నా చెల్లెలు. తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకూ వరి ధాన్యం కొనుగోలు అంశం నుండి అనేక ప్రశ్నలను కేంద్ర మంత్రుకు ట్విట్టర్ ద్వారా సంధించిన ఈ అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా ట్విట్టర్ వేదికగా అనేక సందేహాలును వ్యక్తం చేసారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమీత్ షా పర్యటన పట్ల కూడా ఈ అన్నా చెల్లెలు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

మొన్న రాహుల్, నేడు అమీత్ షా.. ట్విట్టర్ ద్వారా కేటీఆర్, కవిత ప్రశ్నల వర్షం
కేటీఆర్, కల్వకుంట్ల కవిత వీరిద్దరూ ఇప్పుడు ట్విట్టర్ లో పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.సహజంగా కెటీఆర్ ఎప్పటి నుంచో పలు అంశాలపై ట్వీట్స్ చేయటంలో ముందు వరసలో ఉంటారు. ఇప్పుడు కవిత కూడా అన్నకు పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో అనేక ప్రశ్నలను సంధించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండవ దశ ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా నగరానికి వస్తున్నారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఆయనకు ఏకంగా 27 ప్రశ్నలు సంధించారు.

పదునైన ఆయుధంగా మారిన ట్విట్టర్.. బాగా వాడుకుంటున్న కేటీఆర్, కవిత
తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తాను అడిగే ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సవాల్ విసిరారు. గుజరాత్‌పై అమితమైన ప్రేమ, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ నిజం కాదా? తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ, గుజరాత్‌కు ఆగమేఘాలపై నిధులు కేటాయించడం దేనికి సంకేతం అని ట్విట్టర్ వేదికగా ఘాటుగా ప్రశ్నించారు. విభజన చట్టంలోని ఒక్క హామీ అయినా నెరవేర్చారా? కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఒక్క విద్యా సంస్థ పేరైనా చెబుతారా? మెడికల్ కాలేజీలు ఎందుకు మంజూరు చేయలేదు? అంటూ పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. కేటీఆర్ ప్రశ్నల వర్షానికి ధీటుగా ఎమ్మెల్సీ కవిత కూడా అమీత్ షా కు సందేహాల ఉప్పెన కురిపించారు.

ట్విట్టర్ వాడకంలో కవిత కేటీఆర్ పోటీ.. ప్రశ్నల సునామీతో ఉక్కిరి బిక్కిరవుతున్న జాతీయ నేతలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కేటీఆర్ తరహాలోనే మంత్రి అమిత్ షాకు ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. నింగిని తాకుతున్న ద్రవ్యోల్బణానికి, పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లకు మీ సమాధానం ఏంటని కవిత అమీత్ షా ను నిలదీసారు. ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ ఈఆర్, ఐఐఐటి, ఎన్ఐడి, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో వివరించాలని డిమాండ్ చేసారు. తెలంగాణకు బకాయి ఉన్న మూడు వేల కోట్ల రూపాయల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ట్విట్టర్ వేదికగగా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ట్వీట్స్ చేయడంలో పోటీ పడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.