కాంగ్రెస్, బీజేపీలకు తెలివి లేదు- విజన్ అసలే లేదు: కేసీఆర్ లేఖ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్- పార్టీ క్యాడర్ కు లేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అధికార భారత్ రాష్ట్ర సమితి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి వ్యూహాలను రూపొందించుకుంటోంది. అటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తమ ప్రచార కార్యక్రమాల పదును పెంచుతున్నాయి. పాదయాత్రలను చేపట్టాయి. అధికారంలోకి రావడానికి ఈ రెండు పార్టీలు కూడా సన్నద్ధమౌతోన్నాయి.

కేసీఆర్ లేఖ..
తాజాగా- బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ క్యాడర్ కు లేఖ రాశారు. ఆత్మీయ సందేశం పేరుతో దీన్ని విడుదల చేశారు. ఉద్యమస్థాయి నుంచి పార్టీ ఎదిగిన తీరును ఆయన గుర్తు చేశారు. కష్టాలు, కన్నీళ్లు, కరవుతో అల్లాడిన తెలంగాణ- ఇవ్వాళ పచ్చని పంటలతో చిరునవ్వుతో కళకళలాడుతోందని పేర్కొన్నారు. వలస పార్టీల పాలనలో ఆగమైపోయిన తెలంగాణ ఇవ్వాళ కుదుటపడిందని, కడుపునిండాతిని.. కంటినిండా నిద్రపోతోందని అన్నారు.
ఒక్కో పథకం..
తాము అమలు చేస్తోన్న ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి.. అసాధ్యం అనుకున్న పనులను తెలంగాణ సుసాధ్యం చేసి చూపిందని అన్నారు. తమ ప్రభుత్వ- తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టిందని చెప్పారు. అడిగినవీ, అడగనివీ, చెప్పినవీ చెప్పనవీ ఎన్నో పనులు చేస్తూ అందరి బంధువుగా నిలిచామని, ఏ వర్గాన్ని కూడా చిన్నబుచ్చలేదని కేసీఆర్ అన్నారు.

బీజేపీ బరితెగింపు..
ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదని, దేశం కూడా బాగుపడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. దేశాన్ని ఇన్నేళ్లుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలకు తెలివి లేదని, విజన్ గానీ, సంకల్పం గానీ అసలు లేవని విమర్శించారు. అందుకే దేశానికి కొత్త అజెండాను నిర్దేశించామని, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని తాము ఎత్తుకున్నామని చెప్పారు.

బీఆర్ఎస్ ది పేగుబంధం..
బీజేపీ బరితెగింపు దాడులు చేస్తూ- తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డుకుంటోందంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. వేల దాడులు, లక్షల కుట్రలను తాము ఛేదించామని కేసీఆర్ అన్నారు. నాడు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. సాహసమే ఊపిరిగా తన ప్రయాణం సాగుతోందని, ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలే తన బలం.. బలగం అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణతో బీఆర్ఎస్ ది పేగుబంధమని, పురిటిగడ్డపై మరోసారి గులాబీ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యమని చెప్పారు.

నిత్యం ప్రజల్లో..
చైతన్యం తొణికిసలాడే గడ్డ తెలంగాణ అని, ప్రజలే కేంద్రబిందువుగా బీఆర్ఎస్ పని చేస్తోందని చెప్పారు. ఇది ఎన్నికల సంవత్సరమని, అందుకే ప్రతి నాయకుడు, కార్యకర్త నిరంతరం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ సూచించారు. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ను బలోపేతం చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని చెప్పారు. చివరికి ధర్మమే జయిస్తుందని కేసీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications