బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో కీలక పరిణామం..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అటు కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ సింగపూర్... ఆ తరువాత దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. ఇటు బీఆర్ఎస్ మరోసారి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కోసం సుప్రీంను ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటూ రెండు పిటీషన్లను దాఖలు చేసింది.
సుప్రీంలో పిటీషన్లు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై చర్యలు కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంలో పిటీ షన్లు దాఖలు చేసింది. పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కు వ్యతిరేకంగా ఎస్ఎల్‌పీ బీఆర్ఎస్ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై బీఆర్ఎస్ రిట్ పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని కోర్టుకు బీఆర్ఎస్ తెలిపింది.

హైకోర్టు ఆదేశాలతో
ఇప్పటి వరకు నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో బీఆర్ఎస్ వివరించింది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోర్టును బీఆర్ఎస్ అభ్యర్దించింది. పార్టీ ల ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు వచ్చిందని గుర్తు చేసింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ తరువాత ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందుంచాలని, విచారణ తేదీలు నిర్ణయించి 4 వారాల్లో రిజిస్ట్రీకి సమాచారం ఇవ్వాలని సింగిల్ బెంచ్ సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చింది.
అనర్హత వేటు వేయాలి
అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఆలోక్ అరాధె, జస్టిస్ జె.శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసుపై తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఈ అంశాలను పిటీషన్ లో ప్రస్తావిస్తూ.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. వెంటనే అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరింది.












Click it and Unblock the Notifications