US-Iran War: ఫిబ్రవరి 28 నుంచి జులై వరకు.. ట్రంప్-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామాలు ఇవే
US-Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఇరాన్‌తో మొదలైన యుద్ధం కొన్ని నెలల వ్యవధిలోనే సరికొత్త మలుపులు తిరిగింది. ప్రారంభంలో ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ యుద్ధం.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే హోర్ముజ్ జలసంధి నియంత్రణ చుట్టూ తిరుగుతోంది. 2026 ఫిబ్రవరి 28న అణుస్థావరాలపై దాడులతో మొదలైన ఈ యుద్ధం.. ప్రస్తుతం చమురు రవాణా మార్గాలను అడ్డుకునే సమరంగా ఎలా మారిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫిబ్రవరి 28: 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ప్రారంభం
2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరిట భారీ వైమానిక దాడులకు దిగాయి. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే పరమావధిగా జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ అణు ప్రాజెక్టులు,మిస్సైల్ సైట్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ఆ దేశ పాలనా వ్యవస్థకు కోలుకోలేని దెబ్బగా మారింది. దీనిక ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడటమే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజు జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ మార్గం గుండానే సాగుతుండటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

మార్చి-ఏప్రిల్: హోర్ముజ్ సంక్షోభం, తాత్కాలిక సీజ్ ఫైర్
మార్చి నెలలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడటంతో అంతర్జాతీయ షిప్పింగ్ రంగం నిలిచిపోయింది. దీనికి ప్రతిచర్యగా అమెరికా నౌకాదళం రంగంలోకి దిగి ఇరాన్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. ఈ ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్, చైనాల మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 7-8 తేదీల్లో రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరింది. ఆ తర్వాత పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ అధికారుల మధ్య 1979 తర్వాత అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. అయితే హోర్ముజ్ జలసంధి నియంత్రణపై ఇరుదేశాలు పట్టుదలకు పోవడంతో చర్చలు విఫలమయ్యాయి. వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఓడరేవులపై రెండు వైపుల నుంచి దిగ్బంధం విధించడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అలాగే లెబనాన్ లో హిజ్బుల్లా-ఇజ్రాయెల్ పోరు మళ్లీ మొదలైంది.
మే-జూన్: ఇస్లామాబాద్ ఒప్పందం, ఊరట
మే నెలలో ఇరుపక్షాల మధ్య భీకర యుద్ధం సాగుతున్నప్పటికీ.. తెరవెనుక రాయబారాలు నడిచాయి. జూన్ నెలలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఓ పెద్ద ఊరట లభించింది. జూన్ 14న ఇస్లామాబాద్ ఒప్పందం ఖరారు కాగా.. జూన్ 17న ఫ్రాన్స్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, లెబనాన్ లో యుద్ధాన్ని ఆపడం, ఇరాన్ పై ఆంక్షల సడలింపు, అణు కార్యక్రమంపై తదుపరి 60 రోజుల్లో చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంతో చమురు రవాణా పాక్షికంగా ప్రారంభమై ప్రపంచ దేశాలకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
జులై 2026: మళ్లీ ఒప్పందం విఫలం
జూన్ నెలలో కుదిరిన ఒప్పందం ఎక్కువ రోజులు నిలవలేదు. జులై ప్రారంభంలో ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిలో మూడు అంతర్జాతీయ నౌకలపై దాడులుకు పాల్పడటంతో మళ్లీ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ చర్యను ఒప్పంద ఉల్లంఘనగా పేర్కొన్న డొనాల్డ్ ట్రంప్.. ఒక 'ఒప్పందం ముగిసింది' అని ప్రకటించారు. వెంటనే రంగంలోకి దిగిన అమెరికా సెంట్రల్ కమాండ్, ఇరాన్ రాడార్ వ్యవస్థలు, యాంటీ-షిప్ మిస్సైల్ సైట్లు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బోట్లపై ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్ కూడా బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. జులై 8 నాటికి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారినప్పటికీ.. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారకుండా అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది. ప్రారంభంలోని ఇరాన్ అణ్వాయుధాలను తుడిచిపెట్టడమే డొనాల్డ్ ట్రంప్ వ్యూహం అయినప్పటికీ.. ఇరాన్ తనకున్న అత్యంత బలమైన ఆయుధం హార్ముజ్ జలసంధిని ప్రయోగించడంతో యుద్ధ రంగం పూర్తిగా మారిపోయింది.












Click it and Unblock the Notifications