కవిత కేసులో మరో పరిణామం
Kalvakuntla Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరింత చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆమె కష్టాలు మరింత పెరిగాయి. ఇదివరకు ఆమెకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

నేటితో జ్యుడీషియల్ కస్టడీని ముగిసిన నేపథ్యంలో కవితను అధికారులు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా.. వాదనలను ఆలకించారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది నీతీష్ రాణా తన వాదనలను వినిపించారు. ఈడీ, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు.
కవితను మరో 10 రోజుల పాటు తమ జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని, మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని న్యాయమూర్తికి వివరించారు.
సీబీఐ తరఫు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు. న్యాయస్థానం నుంచి వెలుపలికి వచ్చిన అనంతరం కవిత విలేకరులతో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఇది సీబీఐ కస్టడీ కాదని.. బీజేపీ కస్టడీగా అభివర్ణించారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications