చిక్కుల్లో రాజా సింగ్- సుప్రీంకోర్టులో..!!
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చెందిన గోషా మహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్‌కు చిక్కులు వీడట్లేదు. ఆయన ఎన్నిక వ్యవహారాన్ని భారత్ రాష్ట్ర సమితి నాయకులు అంత తేలిగ్గా విడిచిపెట్టేలా కనిపించట్లేదు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్‌కు వెళ్లారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో టీ రాజా సింగ్- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోషా మహల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ ను ఓడించారాయన. 2014లోనూ ఇదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఈ దఫా మాత్రం వివాదాలను కొని తెచ్చుకున్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అరెస్ట్ అయ్యారు. ప్రీవెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసులను ఎదుర్కొంటోన్నారు. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వివరణ సైతం ఇచ్చుకోవాల్సి వచ్చిందాయనకు. అటు బీజేపీ అగ్ర నాయకత్వం ఆయనను సస్పెండ్ కూడా చేసింది.

అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు ఆయన ఎన్నికకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక సక్రమమైనదేనంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు ప్రేమ్‌సింగ్ రాథోడ్ సుప్రంకోర్టును ఆశ్రయించారు.
ఇదివరకు రాజా సింగ్ ఎన్నికపై హైకోర్టులో కూడా పిటీషన్ వేసింది ఆయనే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని, విధ్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని, నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను భయభ్రాంతుకులకు గురి చేశారనేది ప్రేమ్‌సింగ్ రాథోడ్ ఆరోపణ. దీనిపై విచారించిన హైకోర్టు రాజా సింగ్‌కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications