కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం?: సరిగ్గా 15 రోజులే టైమ్
BRS: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడింది. ఇప్పటికే పలువురు శాసన సభ, శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. మాజీ ఎంపీలు సైతం అదే బాట పట్టారు.
ప్రతిపక్షంపై పంజా
చేరికల విషయంలో రేవంత్ రెడ్డి.. పంజా విసురుతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే గేట్లు ఎత్తేశారు. దీనికి దెబ్బకు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి కకావికలమౌతోంది. తేరుకోలేకపోతోంది. అధికారంలోకి వచ్చిన ఈ తొలి ఆరు నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

సీనియర్లు సైతం..
రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి నేతలు సైతం ఆ పార్టీలో చేరిపోయారు. కే కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, రాములు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టీ రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య.. వంటి ఎంతోమంది బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన వారిలో ఉన్నారు.
మొన్నటికి మొన్న..
మొన్నటికి మొన్న.. ఆరు మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్‌ను వీడారు. దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.. కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయంలో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలు కూడా చూడట్లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాగా ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
లైనులో మరో ఇద్దరు..
ఇదే జాబితాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్‌లో చేరొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. వారితో పాటు మరో ఆరుమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం పార్టీ ఫిరాయిస్తారని అంటున్నారు.
దానం నాగేందర్ వ్యాఖ్యలు..
ఈ పరిస్థితులపై మాజీ మంత్రి, కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలకు గౌరవం దక్కట్లేదని విమర్శించారు. కేటీఆర్ వారిని పురుగులను చూసినట్లుగా చూస్తోన్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరిన తమకు ఆత్మగౌరవం ఉంటుందని భావిస్తోన్నారని చెప్పారు.
నియోజకవర్గాలకే అభివృద్ధి పరిమితం..
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తమ నియోజకవర్గాల వరకే అభివృద్ధిని పరిమితం చేశారని దానం నాగేందర్ పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యలకు సైతం కనీసం కోటి రూపాయలను కూడా మంజూరు చేయలేకపోయారని ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లో తాము అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించుకోవాల్సి వచ్చిందని అన్నారు.
నేరుగా కలవొచ్చు..
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవ్వరైనా సరే.. నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందని, జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రులను కలిసి తమ నియోజకవర్గాల అభివృద్ధిపై వినతిపత్రం ఇవ్వొచ్చని దానం నాగేందర్ పేర్కొన్నారు. శనివారం మరో ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నారని తెలిపారు.
15 రోజులే..
వచ్చే 16 రోజుల్లో బీఆర్ఎస్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనమౌతుందని దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఆత్మగౌరవం ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్‌లో ఉండబోరని, ఉండే వాళ్లు కూడా ఎటు పోవాలో తెలియని వాళ్లేనని వ్యాఖ్యానించారు. తనపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకుంటామంటూ కేటీఆర్ చెప్పడం పట్ల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ లోపలే బీఆర్ఎస్ ఉండదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications