రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్: కాంగ్రెస్‌లో చేరిక?
Danam Nagender: లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి.. ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒకవంక- ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాలను రూపొందించుంటోండగా.. మరోవంక- సీనియర్లు షాకుల మీదు షాకులు ఇస్తోన్నారు. వలస వెళ్తోన్నారు.
ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. కారు దిగారు కూడా. ప్రత్యామ్నాయ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కండువాలను కప్పుకొన్నారు. నాగర్ కర్నూల్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత.. ఇతర పార్టీల్లో జాయిన్ అయ్యారు.

బొంతు రామ్మోహన్, టీ రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి.. వంటి నేతలూ బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. అదే జాబితాలో తాజాగా ఖైరతాబాద్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కొద్దిసేపటి కిందటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఇతర కాంగ్రెస్ నేతలను కలుసుకొన్నారు. అరగంటకు పైగా వారితో చర్చించారు. దీనితో తన సొంత గూటికి చేరుకోవడానికి దానం నాగేందర్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 17వ తేదీన ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరొచ్చని అంటోన్నారు.
గతంలో దానం నాగేందర్ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన విషయం తెలిసిందే. గతంలో ఆసిఫ్ నగర్, అనంతరం ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ వెనక్కి వచ్చారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అనంతరం మంత్రిగా పని చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌కు దూరం అయ్యారు. బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సొంతగూటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటోన్నారు దానం నాగేందర్.












Click it and Unblock the Notifications