దస్ కా దమ్: బీఆర్ఎస్ ఖల్లాస్: మరో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ కండువా
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడింది. ఇప్పటికే పలువురు శాసన సభ, శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. మాజీ ఎంపీలు సైతం అదే బాట పట్టారు.
ఇప్పటివరకు మొత్తం తొమ్మిదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్‌పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్- జగిత్యాల, కాలె యాదయ్య- చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల, టీ ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్, అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి.. కాంగ్రెస్‌లోకి వలస వెళ్లారు.

ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కొద్దిసేపటి కిందటే రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పఠాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు మహిపాల్ రెడ్డి. ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన కాటా శ్రీనివాస్ గౌడ్‌ను ఓడించారు. పఠాన్‌చెరును బీఆర్ఎస్ కంచుకోటగా మర్చారాయన. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ కొట్టారు.
నాలుగు రోజుల వ్యవధిలో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మూడో శాసన సభ్యుడు మహిపాల్ రెడ్డి. శనివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్.. కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే శేరిలింగంపల్లి శాసన సభ్యుడు అరికెపూడి గాంధీ అదే బాట పట్టారు. ఇప్పుడు తాజాగా మహిపాల్ రెడ్డి.. పార్టీ ఫిరాయించడం బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌గా చెప్పుకోవచ్చు.
ఈ వలసలు ఇక్కడితో ఆగకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించగా.. ఇప్పుడా సంఖ్య 29కి దిగజారింది. రాజీనామా చేయకపోవడం వల్ల సాంకేతికంగా పార్టీ ఫిరాయించినప్పటికీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానే కొనసాగుతారు.












Click it and Unblock the Notifications