రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని వివరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Revanth Reddy: తెలంగాణలో.. ప్రత్యేకించి హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోందంటూ భారత్ రాష్ట్ర సమితికి చెందిన కుత్బుల్లాపూర్ శాసన సభ్యుడు కేపీ వివేకానంద్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టడానికి తక్షణ చర్యలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ యువత గంజాయి మత్తులో మునిగితేలుతోందని, కుటుంబాలు, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదని వివేకానంద అన్నారు. గతంలో తమ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపిందని, దీన్ని అరికట్టడానికి ప్రత్యేక విభాగాలను సైతం ఏర్పాటు చేసిందని గుర్తు చెప్పారు.

పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లోనూ విక్రయించేంతటి స్థాయికి గంజాయి వ్యాపారం సాగుతోందని వివేకానంద ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మానుష్య ప్రదేశాల్లో యథేచ్ఛగా గంజాయిని సేవిస్తోన్నారని, అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.
తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తోన్నారని, వారిలో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారేనని అన్నారు. ఇంజినీరింగ్, ఫార్మా, మెడికల్, జూనియర్, డిగ్రీ కాలేజీలు తన నియోజకవర్గం పరిధిలో ఉన్నాయని, అందులో చదివే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయిని విక్రయిస్తున్నారని చెప్పారు.
ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి మాదక ద్రవ్యాల సరఫర, వినియోగంపై కఠిన చర్యలను తీసుకోవాలని వివేకానంద డిమాండ్ చేశారు. మత్తు బారిన పడి చిత్తు అవుతున్న తెలంగాణ యువత భవిష్యత్తును కాపాడాలని అన్నారు. దీనికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications