ముసుగు తొలగించండి: రాజకీయాలపై సండ్ర వెంకటవీరయ్య సంచలనం
ఖమ్మం: రాజకీయాలపై ఖమ్మం జిల్లా సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు రాజకీయ నాయకులు తప్పుడు పద్ధతిని ఎంచుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100 మంది లబ్ధిదారులకు 66 లక్షలు ముఖ్యమంత్రి సహాయ చెక్కులను సండ్ర వెంకటవీరయ్య అందించారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ముసుగు వేసుకుని కొందరు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముసుగు తొలగించి రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. తాను ఎప్పుడూ దొంగ రాజకీయాలు చేయలేదని, కొంతమంది తప్పుడు పద్ధతిలో షార్ట్‌కట్ మెదడుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

అయితే, ఏ నాయకుడిని ఉద్దేశించి సండ్ర వెంకటవీరయ్య ఈ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఉండి తప్పు చేస్తే తనను విమర్శించాలని.. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ నిబద్ధతతో ఎమ్మెల్సీ ఓటు వేశానని సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు.
కాగా, సండ్ర వెంకటవీరయ్య మొదటిసారి సీపీఎం తరపున శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచే వరుసగా మూడుసార్లు శాసనసభ్యునిగా విజయం సాధించారు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ప్రస్తుతం సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.












Click it and Unblock the Notifications