సుప్రీంకోర్టులో సీబీఐని ఎండగట్టిన తెలంగాణ పోలీసులు..!!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును సీబీఐకి బదలాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.
హైదరాబాద్: అధికార భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు శాసన సభ్యుల కొనుగోలు కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐకి బదలాయించడాన్ని తప్పు పట్టింది. సీబీఐ పనితీరు పైనా అనుమానాలను వ్యక్తం చేస్తూ- తన వాదనలను ఘాటుగా వినిపించింది.

సిట్ నుంచి తప్పించి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఇదివరకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న నిందితులు స్వయంగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సానుకూలంగా ఆదేశాలు వెలువడ్డాయి. దర్యాప్తును సీబీఐకి బదలాయించింది. దీనిపట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..
బీఆర్ఎస్‌కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ శాసన సభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయించేలా ప్రలోభ పెట్టటానికి ప్రయత్నించినట్టుగా బీజేపీ నాయకులు ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సారథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది.

సీబీఐకి బదలాయింపు..
సిట్ అధికారులు తమను వేధిస్తోన్నారంటూ నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సింగిల్ జడ్జి వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదలాయించింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సీబీఐ పని చేస్తోన్నందున బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా కేసును మార్చుకుంటారని ఆందోళన వ్యక్తం చేసింది.

స్టే నిరాకరణ..
సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ అప్పీల్ పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇవ్వాళ ఆదేశాలను జారీ చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను మెయింటెనబిలిటీ కారణంగా కొట్టివేసింది. స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

సుప్రీంలో అప్పీల్ పిటీషన్..
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుతవం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇవ్వాళ విచారణకు వచ్చిందీ పిటీషన్. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ పోలీసుల తరఫున దుష్యంత్ దవే, బీజేపీ తరఫున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలను వినిపించారు.

కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో..
ఈ కేసులో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసింది బీజేపీయేననే ఆరోపణలు ఉన్నాయని, కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా బీజేపీయేనని దుష్యంత్ దవే అన్నారు. ఆ కేంద్రం నియంత్రణలోనే సీబీఐ పని చేస్తోందని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో బీజేపీ నేతల పేర్లు ఉన్నాయని, వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు సాక్ష్యాధారాలను సైతం ఉన్నాయని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం- సీబీఐ విచారణలో జోక్యం చేసుకునే అవకాశాలు లేకపోలేదని అన్నారు.

ప్రతిపక్షాలపై సీబీఐ ప్రయోగం..
ఇవ్వాళ ఏ న్యూస్ ఛానల్ చూసినా.. ప్రతిపక్షం పార్టీలకు చెందిన నాయకులపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేస్తోన్న సమాచారం ప్రసారమౌతుంటుందని దుష్యంత్ దవే అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఏ ఒక్క నాయకుడిపైన అయినా సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు.

27కు వాయిదా..
ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయించడాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక ఆచారంగా పెట్టుకుందని అన్నారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. వాదోపవాదాలను విన్న తరువాత న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్ పై తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications