రేవంత్ Vs కేసీఆర్ - తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నేత ఖరారు..!!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ రోజు నూతన అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ తొలి సారి అసెంబ్లీకి రానున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత ఎవరనే చర్చ కొద్ది రోజులుగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆస్పత్రిలో ఆపరేషన్ జరగటంతో కేసీఆర్ ఈ సారి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం లేదు.
విపక్ష నేతగా కేసీఆర్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు విపక్ష నేతగా వ్యవహరించనున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన సమయం నుంచి విపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరిస్తారా..మరొకరికి అవకాశం ఇస్తారా అనే చర్చ మొదలైంది. పదేళ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావటానికి ఇష్టపడతారా లేదా అనే దాని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, కేసీఆర్ విపక్ష నేతగా వ్యవహరించేందుకు సిద్దమయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని..ప్రతిపక్ష పాత్రలోనూ సమర్ధతవంతంగా వ్యవహరిద్దామని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. దీంతో..ఈ రోజు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల వేళ గంటలకు బీఆర్‌ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అయి కేసీఆర్ ను తన శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ : బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. తుంటి ఎముక చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ ఈ భేటీకి హాజరయ్యే అవకాశం లేదు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదుట ఉన్న గన్‌పార్కుకు చేరుకొని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు.

కేసీఆర్ ఎంపిక : ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే తెలంగాణ మూడో శాసనసభ తొలి విడత సమావేశాలకు బీఆర్‌ఎస్ సభ్యులు హాజరవుతారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యేలుగా బీఆర్‌ఎస్ తరపున ఎన్నికైన నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ అవతరించిన నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతకు కేబినెట్ హోదా దక్కుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉండేందుకు మొగ్గు చూపటంతొ.. పార్టీ ఎమ్మెల్యేలు ఆయన్నే తమ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నారు. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్ తరపున కేసీఆర్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తే అటు పార్టీకి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమైనట్టు సమాచారం.












Click it and Unblock the Notifications