కేసీఆర్ అధ్యక్షతన 15న పార్లమెంటరీ పార్టీ భేటీ: ప్రత్యేక సమావేశాలపై దిశానిర్దేశం
హైదరాబాద్: సెప్టెంబర్ 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యతన జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తప్పకుండా హాజరుకావాలని స్పస్టం చేశారు. సెప్టెంబర్ 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరిచాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
కాగా, జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, యూసీసీ వంటి కీలక అంశాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చకు రావచ్చునని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, మణిపూర్ అంశం, ధరల పెరుగుదల, తదితర అంశాలపై కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. మెజార్టీ విపక్ష పార్టీలు ఇండియా కూటిమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కేంద్రంపై ఈ కూటమి నేతలు పలు అంశాలపై ప్రశ్నలు కురిపించే అవకాశం ఉంది.

మరోవైపు, చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివిధ పార్టీలకు లేఖ రాశారు. వీటన్నింటిపై బీఆర్ఎస్ వైఖరిని కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే.. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉండటంతో ఈ అంశంపైనా చర్చించనున్నారు.
ఒకవేళ దేశంలో జమిలి ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జమిలి ఎన్నికలకు కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, జమిలి ఎన్నికలు జరగకుంటే తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం మొదలు పెట్టాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కసరత్తులు చేస్తుండగా.. తాము అధికారం చేబడతామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications