కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్- ఆ కీలకాంశాలు
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కాంగ్రెస్ పాలనపై ఓ సమగ్ర ఛార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. ఈ 1,000 రోజుల పాలన.. ప్రజలను వంచించడానికే పరిమితమైందని ఆరోపించారు.
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణలో భవన్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు ఈ ఛార్జిషీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజల ఆశలను ఆవిరి చేసిందని దుయ్యబట్టారు.

రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసం చేసిందని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో రైతాంగానికి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరాకు ఇస్తామన్న రూ.15,000 సాయాన్ని ఎగ్గొట్టారని, వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సిన రూ.12,000 సాయాన్ని కూడా మాయం చేశారని ధ్వజమెత్తారు. రూ. రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు.
నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4,000 నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ కూడా నీటిమూటలుగానే మిగిలిపోయాయని కేటీఆర్ విమర్శించారు. ఈ 1000 రోజుల పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, గురుకుల పాఠశాలలను మూసివేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. విద్యార్థులకు ఇస్తామన్న రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డ్ ఊసే లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 12,000 కోట్లు దాటడంతో పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
మహిళలకు ఇవ్వాల్సిన నెలకు రూ. 2,500 సాయం, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం తదితర హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఎత్తిచూపారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం చేతులారా ఏపీకి అప్పగించిందని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి, తెలంగాణను దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తోన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications