మా 72,409 ఓట్లు మాకు పడకుండా పోయాయ్- జాతకాలు తారుమారు అయ్యాయ్: బీఆర్ఎస్ సంచలనం
తెలంగాణలో స్థానిక సంస్థల వేడి రాజుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు త్వరలో ఎన్నికల నగారా మోగబోతోంది. మెజారిటీ స్థానిక సంస్థలను గెలుచుకోవడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకునే పనిలో పడ్డాయి.
ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. కారును పోలి ఉండే ఎన్నికల గుర్తులను తొలగించాలని వారు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

జూలై 7న కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో కొన్ని బీఆర్ఎస్ అధికారిక గుర్తు కారును పోలి ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన, కారుకు బదులుగా అలాంటి పోలిక కలిగిన గుర్తు ఉన్న అభ్యర్థికి ఓటు వేయవచ్చని వివరించారు.
బీఆర్ఎస్ మాజీ ఎంపీ బొయిన్‌పల్లి వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్.. తదితరులు ఎస్ఈసీని కలిశారు. కెమెరా, చపాతీ రోలర్, షిప్ వంటి గుర్తులు ఓటర్లను గందరగోళానికి గురిచేసే అవకాశం ఉందని తెలిపారు. అవన్నీ కూడా కారు గుర్తును పోలి ఉన్నాయని పేర్కొన్నారు. చపాతి రోలర్- 60,125, కెమెరా- 9,051, షిప్- 3,233 ఓట్లు పోల్ అయ్యాయని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.
ఓటర్లు స్వేచ్ఛగా, ఎటువంటి గందరగోళానికి గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడానికి వీలుగా ఈ మూడు గుర్తులను ఉచిత గుర్తుల జాబితా నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ/జడ్పీటీసీ స్థానాలకు సాధారణ ఎన్నికల్లో, అలాగే ఇతర రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మూడు గుర్తులను ఎవరికీ కేటాయించకూడదని కోరారు.
2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇదే విధంగా గందరగోళానికి గురయ్యారని బీఆర్ఎస్ నాయకులు ఎస్ఈసీకి వివరించారు. ఫలితంగా కారు గుర్తుకు పడాల్సిన 72,409 ఓట్లు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో అదే పరిస్థితి తలెత్తకుండా చూడాలని, ముందుగానే దీన్ని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications