ఆ నియోజకవర్గాల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం
KCR: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని, మరిన్ని అధిక లోక్‌సభ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయ భారాన్ని లోక్‌సభ బరిలో విజయంగా మలచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.
ఈ క్రమంలో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేసీఆర్, బీఎస్పీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంయుక్తంగా ప్రకటించారు. బీఆర్ఎస్-బీఎస్పీ మధ్చ పొత్తు కుదిరినట్లు వెల్లడించారు.
తాజాగా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల వ్యవహరం ముగిసింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాలను బీఎస్పీకి కేటాయించింది బీఆర్ఎస్. ఒకటి- హైదరాబాద్, రెండు- నాగర్ కర్నూల్. ఈ రెండు చోట్ల కూడా తన అభ్యర్థిని నిలపట్లేదు బీఆర్ఎస్. వాటిల్లో బీఎస్పీకి మద్దతు ఇస్తుంది.
ప్రస్తుతం నాగర్ కర్నూల్‌లో గులాబీ జెండా ఎగురుతోన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేత పీ రాములు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఇటీవలే బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారాయన. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఈ స్థానాన్ని వదులుకుంది బీఆర్ఎస్. బీఎస్పీకి కేటాయించింది.
బీఎస్పీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నాగర్ కర్నూల్ నుంచి లోక్‌సభకు పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏఐఎంఐఎంకు కంచుకోటగా ఉంటూ వస్తోన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని కూడా బీఎస్పీ దక్కించుకుంది. ఇక్కడ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications