కేసీఆర్ కొత్త కాన్వాయ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు.. విజయవాడకు తరలింపు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కోసం కొత్త కాన్వాయ్ సిద్ధమవుతోంది. భద్రతా చర్యల్లో భాగంగా నూతన వాహన శ్రేణిని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో నూతన వాహన శ్రేణి ఉండాలనే ఉద్దేశంతో ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు వీటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చనున్నారు. కృష్ణా జిల్లా వీరపనేని గూడెంలో వీటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.
కేసీఆర్ కాన్వాయ్‌లో 8 తెలుపు రంగు టయోటా ల్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయి. వీటిని బుల్లెట్ ప్రూఫ్‌తో సిద్ధం చేసేందుకు విజయవాడ సమీపంలో ఉన్న వీరపనేని గూడెంకు తరలించారు. ఇక్కడ సంబంధిత సంస్థ తయారీ కేంద్రం ఉంది. వీటితోపాటు రెండు బస్సులను కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్సులుగా మార్చబోతున్నారు. రెండు రోజుల కిందటే వీటిని ఒక కార్గోలో గన్నవరం విమానాశ్రయానికి చేర్చి అక్కడి నుంచి తయారీ యూనిట్ కు తరలించారు. కేరళ నుంచి ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఇంజనీర్లను కూడా సంబంధిత సంస్థ రప్పించింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పనులు జరుగుతున్నాయి.

దేశంలోని పోలీసుశాఖకు చెందిన విభాగాలన్నీ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ ను అమర్చేందుకు జార్కండ్‌లోని ఒక కంపెనీవద్ద తయారు చేయించేవి. సంబంధిత సంస్థ కృష్ణా జిల్లాలోని వీరపనేని గూడెంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వాహనాలను అక్కడికి తరలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌తోపాటు పలు రాష్ట్రాల్లోని వీవీఐపీలకు వీరపనేని గూడెం నుంచే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారవుతున్నాయి.
రానున్న సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విస్త్రతంగా పర్యటిస్తారు. యాత్రలకు బస్సులను ఉపయోగించాలని భావించడంతో రెండు బస్సులను బుల్లెట్ ప్రూఫ్ బస్సులుగా మార్చబోతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తెలంగాణలో త్రిముఖ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications