ఆ స్థానానికి త్వరలో ఉపఎన్నిక, బీఆర్ఎస్ గెలుపు పక్కా: కేటీఆర్ జోస్యం
హైదరాబాద్: తొందర్లోనే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి రాజయ్య గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. హైకోర్టులో తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మిగతా వాళ్లపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ భవన్లో గురువారం జరిగిన చేరికల కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ కండువాను కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్పీకర్.. రాజకీయ పక్షపాతం చూపిస్తూ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపించారు.

ప్రస్తుతం దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం కష్టంగా ఉందన్నారు కేటీఆర్. 14 సీట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయామని చెప్పారు. అందులో సగం గెలిచిన కథ వేరేలా ఉండేదన్నారు. పార్లమెంటు ఎన్నికలు రెండు కూటముల మధ్య నడిచిందని చెప్పారు. గత ఎన్నికల ఓటమితో భయపడాల్సిన, బాధ పడాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ అబద్ధాల హామీలకు మోసపోయారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోతే వార్త.. రేవంత్ రెడ్డి వచ్చాక కరెంటు ఉంటే వార్త అని ఎద్దేవా చేశారు.
30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శించారు. మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉద్యోగం వచ్చిందంటే కేవలం రాహుల్ గాంధీకి ప్రతిపక్షనేత, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉద్యోగం మాత్రమే వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాల మాట బోగస్ అని యువతకు అర్థమైందన్నారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత వాస్తవమో.. జాబ్ క్యాలెండర్లో జాబ్‌లు అంతే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇక, త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు వస్తారని కేటీఆర్ చెప్పారు. కొద్ది రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి రిబ్బన్ కట్ చేశారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పినట్లు రూ.75 కోట్లతో 1.25 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే మాట వాస్తవం అయితే ఇక నుంచి అన్ని ప్రాజెక్టులకు అలాగే చేయాలని సూచించారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications